అమిత్ షా.. సోనియా గాంధీ.. మన్మోహన్ సింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. వీవీఐపీల లిస్టు కాస్త పెద్దదిగానే ఉంటుంది. మరి.. ఇలాంటి వీవీఐపీలకు సెక్యురిటీగా ఉండే సిబ్బంది ఎంతటి కఠినమైన శిక్షణను ఎదుర్కొని తయారవుతారో తెలిసిందే. తాజాగా.. అలాంటి సెక్యురిటీలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది కేంద్రం. ఇప్పటివరకు వీవీఐపీలకు సెక్యురిటీ బాధ్యతల్ని చూసుకునేందుకు పురుష కమాండోలను ఇప్పటివరకు వాడేవారు.
అందుకు భిన్నంగా మహిళా కమాండోల్ని రంగంలోకి దించారు. మొత్తంగా 32 మందితో సిద్ధమైన కమాండో దళాన్ని రంగంలోకి దించాలని డిసైడ్ చేశారు. వీరు అమిత్ షా తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు.. మాజీ ప్రధాని మన్మోహన్ దంపతులకు సైతం రక్షణ కల్పించే బాధ్యత మెరికల్లాంటి అమ్మాయిలదే.
ఊహించని రీతిలో విరుచుకుపడే ముప్పును సమర్థంగా డీల్ చేయటం.. వారికి భద్రతా పరమైన చర్యల్ని ఎప్పటికప్పుడు సమీక్షించేలా వీరికి ట్రైనింగ్ పూర్తిచేశారు. 10 వారాల పాటు సాగే కఠినమైన ట్రైనింగ్ పూర్తై.. వచ్చే జనవరి నుంచి వారు విధుల్లో చేరాల్సి ఉంటుంది.
కొత్తగా వచ్చే మహిళా కమాండో టీంకు అమిత్ షా.. మన్మోమన్ దంపతుల బాధ్యతను అప్పజెబుతారని చెబుతున్నారు. ఈ వీవీఐపీలు ఇంట్లో ఉన్న వేళలో.. ఇంటికి సంబంధించిన అన్ని రకాల భద్రతాపరమైన బాధ్యతల్ని అప్పజెప్పనున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వీవీఐపీలకు రక్షణ కల్పించే బాధ్యతను వీరికి ఇవ్వనున్నారు. ఇప్పటివరకు మెరికల్లాంటిమగాళ్లను సెక్యురిటీగా చూసిన వారికి.. కొత్తగా రంగంలోకి దిగనున్న మహిళా కమాండోలు తమ సత్తా చాటుతారని అంచనా వేస్తున్నారు.