హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్….వుడ్ ఏదైనా సరే…ఒక సినిమా విడుదలైతే చాలు…ఆ సినిమా ఎంత వసూలు చేసిందనేదానిపైనే అందరి ఫోకస్ ఉంటుంది. గతంలో అయితే 100 డేస్, 50 డేస్ అనే లెక్కలుండేవి. కానీ, ఇపుడు ఎన్ని రోజుల్లో ఎంత కలెక్షన్ అనేదే లెక్క. ఈ కలెక్షన్ల విషయంలో గతంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా సినిమాల గ్రాస్, నెట్ కలెక్షన్లపై కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కొన్నేళ్లుగా బాక్సాఫీస్ లెక్కల విషయంలో చిత్ర నిర్మాతలు అబద్దాలు చెబుతున్నారని సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఇక, ఈ మధ్యకాలంలో ట్రేడ్, మీడియాలు కూడా వాళ్ల అఫీషియల్ ఫిగర్స్ చెప్పడం స్టార్ట్ చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అన్ని భాషలు… అన్ని ఇండస్ట్రీలలో ఈ విధానం ఇలాగే ఉందంటూ కామెంట్లు చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో లెక్కల్లో నిజాయతీ లేదంటూ బాంబు పేల్చాడు. సినిమాల కలెక్షన్ రిపోర్టులను తారుమారు చేయడానికి ఈ రోజుల్లో కమీషన్ లేదా రేటు ఎంత తీసుకుంటున్నారంటూ ట్రేడ్, మీడియా వర్గాలనుద్దేశించి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇప్పుడే కాదు….గతంలో టికెట్ రేట్స్ విషయంలో కూడా సిద్ధార్థ్ చేసిన కామెంట్లు కాక రేపాయి. ఏపీలో టికెట్ రేట్స్ తక్కువగా ఫిక్స్ చేసిన నేపథ్యంలో సిద్ధార్థ్ స్పందించాడు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వాల జోక్యం వద్దని, టికెట్ల రేట్లు పెట్టే హక్కు ప్రభుత్వాలకు లేదని అన్నాడు. మరి, సిద్ధార్థ్ తాజా కామెంట్లపై నిర్మాతలు, ట్రేడ్, మీడియా వర్గాల స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.