ఇప్పటివరకు ఎంతమంది ఏమని చెప్పినా.. ఎంతగా మాట్లాడినా.. స్పందించని కేంద్ర హోం మంత్రి కమ్ మోడీకి చెవులుగా చెప్పే అమిత్ షా నోటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించిన కీలక వ్యాఖ్య ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ అవినీతి మీద బీజేపీ నేతలు ఎందరు మాట్లాడినా.. మోడీషాలు మాత్రం ఆ విషయాన్ని విననట్లుగా ఉండేవారు.
అలాంటిది తాజాగా మాత్రం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయిన సందర్భంలో మాత్రం కీలక వ్యాఖ్య ఆయన నోటి నుంచి రావటం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి సంబంధించిన అంశం నా నోటీసులో ఉంది. టీఆర్ఎస్ పై పోరాటం చేయండి.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకుల్ని క్రియేట్ చేసినా.. వెనక్కి తగ్గొద్దు.. ప్రజలతో పాటు మీద ఫోకస్ ను మళ్లించేందుకు ఆయన ప్రయత్నిస్తారు. ఆయన ట్రాప్ లో మీరు పడొద్దంటూ హెచ్చరించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ నేతల్ని ఊరికించాలని.. ఊళ్లల్లోకి రానీయొద్దంటూ టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో టీ బీజేపీ నేతల్ని కలిసిన అమిత్ షా.. వారికి దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. తాజా భేటీ పుణ్యమా అని ఇప్పటివరకు స్పష్టత రాని అంశాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లుగా తెలంగాణ కమలనాథుల నోట వినిపిస్తోంది.
దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో చర్చ సింహభాగం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆయన చేస్తున్న పనుల చుట్టూనే తిరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునివ్వటం గమనార్హం.
ప్రధాన సమస్యల నుంచి ప్రజల ఫోకస్ మళ్లించేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడతారని.. ఆ ఆటలు సాగనీయకుండా ముందుకు పోవాలన్నారు. కేసులు.. నిర్భందాలు జరుగుతూనే ఉంటాయని.. వాటిని ఎదుర్కోవాలని.. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న భరోసాను ఇచ్చారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల్నిబీజేపీనేతలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన జీహెచ్ఎంసీ.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో కొందరు పోలీసులు అతి చేస్తున్నారంటూ అమిత్ షా నోటీసుకు తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందుల్ని తెలుసుకునేందుకు తాను నల్గొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన సందర్భంగా పోలీసులు.. టీఆర్ఎస్ నేతలపై చేసిన దాడుల అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు.
మొత్తంగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా.. టీఆర్ఎస్ మీదా ఏ తీరులో వ్యవహరించాలన్న అంశంపై పూర్తి స్పష్టత లభించినట్లుగా చెబుతున్నారు. అసలైన ఆటకు తెర లేచినట్లేనన్న మాట వినిపిస్తోంది. ఇంతకాలం సీఎం కేసీఆర్ పై వస్తున్న ఫిర్యాదుల్ని వినటమే తప్పించి.. స్పందించని అమిత్ షా.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం అండర్ లైన్ చేసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.