బూతులు తిట్టలేదు. దారుణ వ్యాఖ్యలు చేయలేదు. ఆ మాటకు వస్తే ఉన్నది ఉన్నట్లుగా చెప్పి.. ‘అన్నా.. ఈ యాంగిల్ లో ఆలోచించు. పార్టీకి మంచి జరుగుతుంది. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదు. పార్టీ మళ్లీఅధికారంలోకి వస్తుంది’ అంటూ సూచనలు చేస్తే ఎవరైనా ఏం చేస్తారు? అన్న ప్రశ్నను సంధిస్తే సమాధానం ఇట్టే చెప్పేస్తారు. అలా చేస్తే అది వైసీపీ ఎందుకు అవుతుందన్నట్లుగా సీన్ చోటుచేసుకోవటం తెలిసిందే.
పార్టీ నేతగా.. పార్టీ గురించి ఆలోచించే వ్యక్తిగా మాట్లాడిన ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను.. ఇష్టారాజ్యంగా తిట్టటమే కాదు.. దారుణంగా కొట్టిన వైనానికి సంబంధించిన వీడియో బయటకు రావటం.. రచ్చ రచ్చగా మారటం తెలిసిందే.
ఈ మొత్తం వ్యవహారంలో సుబ్బారావు గుప్తాపై దాడికి పాల్పడిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానిపై అతి కష్టమ్మీద కేసు నమోదు కావటం తెలిసిందే. అతడి తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. అతగాడు చేసిన పనికి సారీ చెప్పాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వేళ.. ఆయన్ను ఇంకా అరెస్టు చేయకపోవటం ఏమిటంటూ ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించాయి.
సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే.. యుద్ద ప్రాతిపదికన అరెస్టు చేసే వరకు ఆగని పోలీసులు.. సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ లో ఇంత జరిగినా.. ఎందుకు కామ్ గా ఉన్నారన్న వాదన సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ సాగింది. అంతేకాదు.. రాజకీయ వర్గాల్లోనూ ఇదే ప్రశ్న వ్యక్తమైంది. జరిగిన దారుణంపై వైసీపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటమే కాదు.. ఇప్పుడున్న సమస్యలు సరిపోనట్లు.. ఇంత ఓవరాక్షన్ అవసరమా? అన్న ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో.. సుబ్బారావు గుప్తాపై దాడికి పాల్పడిన సుభానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
తనపై దాడి చేసిన సుభానిపై ఒంగోలు వన్ టౌన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుబ్బారావుకు కూసింత ఊరట కలిగించేలా ఆయన్ను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ ఏమంటే.. సుభాని చేతిలో దెబ్బలు తిన్న సుబ్బారావును విజయవాడలో జరిగిన సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల కోసం తీసుకెళ్లటం.. కేక్ కట్ చేసి సుబ్బారావు నోట్లో పెట్టారు.
ఆ సమయంలో సుబ్బారావును నా కొడకా.. అంటూ తిట్టి.. అమానుషంగా కొట్టేసిన సుభాని సైతం అక్కడే ఉండటం. ఈ తీరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి ఏమైందో కానీ.. అమానుష దాడికి పాల్పడ్డ సుభానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.
కొసమెరుపు – ఇంతా చూస్తే అతనిని అరెస్టు చేసిన వెంటనే స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు.