‘పెగాసస్’ స్పైవేర్ సాయంతో 20 దేశాల్లో వందలాది వీఐపీల ఫోన్ లను హ్యాక్ చేశారని, వారికి తెలీకుండానే వారిపై నిఘాపెట్టారని 2019 అక్టోబర్ లో వాట్సాప్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ 20 దేశాల్లో భారత్ కూడా ఉందని, భారత్కు చెందిన రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పాత్రికేయులు, ఉద్యమకారులు, న్యాయవాదులు లాంటి చాలామంది మొబైల్ ఫోన్లపై ఈ హ్యాక్ జరిగిందని వాట్సాప్ ఆరోపించడం కలకలం రేపింది.
ఆ తర్వాత భారత్ లోనూ పెగాగస్ ప్రకంపనలు రేపింది. మోడీ కేబినెట్ లోని మంత్రుల ఫోన్లు, కొందరు విపక్ష నేతల ఫోన్లు కూడా ఆ జాబితాలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి సహా మరికొందరు విపక్ష నేతల ఫోన్లను బీజేపీ పెగాసస్ సాయంతో ట్యాప్ చేయించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలు దానిపై ఆందోళనలు చేశాయి.
ఈ క్రమంలోనే గతంలో రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి పేపర్లు చించేసి చైర్మన్ మీదకు విసిరేయడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఎక్స్ పర్ట్ కమిటీని నియమించి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, తమ రాష్ట్రంలో పెగాసస్ స్నూపింగ్ పై దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ లో జస్టిస్ లోకూర్ కమిషన్ ను సీఎం మమత నియమించారు. తాజాగా ఆ కమిషఁన్ పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్టే విధించారు.
దీదీ నియమించిన కమిషన్ పై గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంలో వేసిన పిటిషన్ ను జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దీదీ సర్కార్ పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. స్వతంత్ర కమిటీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీ ఎందుకు వేసిందని జస్టిస్ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ పిటిషన్ పై వివరణ ఇవ్వాల్సిందిగా జస్టిస్ లోకూర్ కమిషన్ ను ఆదేశించారు.