ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో వింత వ్యాధి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అంతు చిక్కని వింత వ్యాధి బారిన పడ్డ ప్రజలకు ప్రాణాపాయం లేకపోయినప్పటికీ…అసలీ వ్యాధి ఎలా వచ్చిందన్న అంశంపై వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. రోగుల రక్తంలో ఎక్కువ మోతాదులో సీసం, నికెల్ వంటి లోహాల అవశేషాలు గుర్తించామని, వాటివల్లే రోగులు అస్వస్థతకు గురై ఉంటారని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాలే వింతరోగానికి కారణంగా అనుమానిస్తున్నారు. నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించే అవకాశం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్యూపిల్ డైలటేషన్, మయో క్లోనిక్ ఎపిలెప్సీలలో ఏదైనా కావచ్చని అనుకుంటున్నారు. ఈ వింత వ్యాధి ప్రబలడానికి కలుషిత నీరే కారణమని మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.
ప్రజారోగ్యాన్ని జగన్ సర్కార్ గాలికి వదిలేసిందని, ఏలూరులో వందలమంది ఆస్పత్రుల పాలవడమే అందుకు నిదర్శనమని నిప్పులు చెరిగారు. పాలనను తేలిగ్గా తీసుకున్న జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, టీడీపీ నేతలను తిట్టడమే వైసీపీ నేతల ప్రధాన ఎజెండా అని ఎద్దేవా చేశారు. తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి రోగులకు అన్ని పరీక్షలు చేశామని, అన్నీ బాగానే ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ఏలూరు ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, ది గార్డియన్ పత్రికలో కూడా కథనం వచ్చిందని, కానీ, ఈ సమయంలో ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఏమయ్యారో తెలియదని చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షంపై గొంతు చించుకొని ఉపన్యాసాలు చెప్పే వైసీపీ మంత్రులు ఆపద సమయంలో పత్తా లేకుండా పోయారని విమర్శించారు.
పెళ్లికి వెళ్తున్న జగన్ దారి మధ్యలో దిగి బాధితులను పరామర్శించడం దారుణమని, దేనిపైనా జగన్ కు సీరియ్సనెస్ లేదనడానికి ఇదే నిదర్శనం అని ధ్వజమెత్తారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన, కచ్చులూరు దగ్గర గోదావరిలో పడవ ప్రమాదం ఘటనలో ఒక రోజు హడావిడి చేసి వదిలేశారని, ఏలూరు వింత వ్యాధి విషయంలోనూ వైసీపీ సర్కార్ తీరు అలాగే ఉందని మండిపడ్డారు.
ఏలూరులో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేదని విమర్శించారు. కాగా, ఏలూరు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం ఫిర్యాదు చేశారు. పరిశుభ్రమైన నీరు పొందడం మానవ హక్కని, దాన్ని ప్రజలకు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యతని లేఖలో పేర్కొన్నారు. ఏలూరులో పారిశుధ్యం లోపించి త్రాగు నీరు కలుషితమైనట్లు అనుమానాలున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎన్హెచ్ఆర్సీకి పట్టాభిరాం నివేదించారు.