తెలంగాణలో వరి కొనుగోలు, మద్దతు ధర వంటి వ్యవహారాలపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సన్నరకం ధాన్యానికి మద్దతు ధర దక్కక ఓ రైతు ఆత్మ హత్య చేసుకున్న ఘటన తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంల బొగుడ భూపతిపూర్‌లో రైతు కరణం రవికుమార్ (40) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై చర్చ జరుగుతోంది. ఘటన స్థలి వద్ద సీఎం కేసీఆర్‌కు మృతుడు రవి రాసినట్లు ఉన్న ఓ లేఖ కలకలం రేపుతోంది.
ఈ క్రమంలోనే కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అసలు తెలంగాణ బిడ్డేనా అని ఫైర్ అయ్యారు. అమరవీరుల స్థూపం నిర్మాణంపై కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, రూ.63 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.180 కోట్లకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత ఖర్చు పెట్టినా ఆ నిర్మాణం ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. అంతేకాకుండా, ఆ టెండర్‌ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇవ్వడాన్ని తపపుబట్టారు.
ఎలాంటి అనుభవం లేని ఆ కంపెనీకి తప్పుడు సర్టిఫికెట్తో పనులు అప్పగించారని ఆరోపించారు. పిడికెడు ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణని దోచుకుంటున్నారన్న కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను ఏపీ వారికే ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎవరూ అర్హులైన కాంట్రాక్టర్లు లేరా అని ప్రశ్నించారు.
అంతకుముందు, రైతు రవికుమార్ కుటుంబసభ్యులకు రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ప్రభుత్వం వరి వేయొద్దనడం వల్లే రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్‌కు రవి కుటుంబీకులు తెలిపారు. రవి తండ్రి పెన్షన్ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడుతానని టీపీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.