బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ పై ఓ కానిస్టేబుల్ సంచలన ఆరోపణలు చేశారు. సురేశ్ తనపై చేయి చేసుకున్నారని, కులం పేరుతో దూషించారని కానిస్టేబుల్ బత్తుల బాబూరావు షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, సురేశ్ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ గుంటూరు ఎస్పీకి వినపతిపత్రం అందించారు.
అనారోగ్య కారణాలతో తాను మూడేళ్లుగా విధులకు హాజరు కాలేకపోయానని, తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాబూరావు తెలిపారు. అయితే, తిరిగి తనను విధుల్లోకి తీసుకునేందుకు సాయం చేయాలని ఎంపీ సురేశ్ ను కోరానని అన్నారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ సురేశ్ కు ఎస్ఎంఎస్ పెట్టానని, ఫోన్ చేసి తనకు సాయం చేయాలని అడిగినందుకు కులంపేరుతో దుర్భాషలాడారని, తనపై చేయి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతేకాదు, ఈ నెల 7న అర్ధరాత్రి సమయంలో తుళ్లూరు పోలీసులు తనను ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ సురేశ్, ఆయన అనుచరులు, తుళ్లూరు ఎస్సై తనను కొట్టి ఫోన్ లాక్కిన అందులోని ఆడియో, వీడియోలు తొలగించారని ఆరోపించాడు. తన భార్య, కుమారుడిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని, 8వ తేదీ అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉంచి తెల్లకాగితాలపై సంతకం తీసుకున్నారని ఆరోపించాడు.
అయితే, తాము బాబూరావుపై చేయి చేసుకోలేదని, ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారన్న ఎంపీ పీఏ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాం అని, చేయిచేసుకోలేదని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు తెలిపారు. మరోవైపు, ఈ ఆరోపణలను ఎంపీ సురేశ్ ఖండించారు. తాను అతడిపై చేయి చేసుకోలేదని, అతడెవరో కూడా తనకు తెలియదని అన్నారు. సాయం కోరుతూ పదేపదే విసిగించాడని, వేరే నంబర నుంచి ఫోన్ చేసి ఆడియో రికార్డును ఎవరివద్ద పెట్టాలో వారి వద్ద పెడతానని హెచ్చరించడంతో తన పీఏ ద్వారా ఫిర్యాదు చేయించినట్టు వివరించారు.