సొంతిల్లు అనేది పేద వారు మొదలు మధ్య తరగతి వారి వరకు ఓ కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు చాలామంది ఏళ్ల తరబడి డబ్బు కూడబెడుతుంటారు. మరికొందరైతే బ్యాంకు లోన్లు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తూ తమ బొమ్మరిల్లును తీర్చిదిద్దుకుంటారు.
అయితే, వీరంతా డబ్బును కూడబెట్టుకునే లోపు నిర్మాణ రంగంలో సిమెంట్, ఇనుము, గృహోపకరణాలు వంటి సామాన్లు రేట్లలో 0.5-1 శాతం వ్యత్యాసం ఉంటుంది. దానిని బట్టి కొంచెం అటు ఇటుగా అనుకున్న బడ్జెట్ లో ఇల్లు కట్టుకోవచ్చు. అయితే, వచ్చే ఏడాది ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి లేదా కొనాలనుకునేవారికి మాత్రం ఆ వ్యత్యాసం ఏకంగా 5 శాతం పెరగనుందని ఓ సర్వేలో షాకింగ్ నిజం వెల్లడైంది.
రాబోయే ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ అధ్యయనంలో వెల్లడైంది. కరోనా దెబ్బకు గత రెండేళ్లుగా ఆల్రెడీ కట్టిన ఇళ్లు, కొత్తగా కడుతున్న ఇళ్లు వెరసి నిర్మాణరంగంలో నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది.
రాబోయే ఏడాది ఆ ధర ఏకంగా 5 శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. భవన నిర్మాణ సామాగ్రి ధరలు నాలుగు రెట్లు పెరగడంతోనే ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది.
ఒక ఇళ్లేకాదు…ఆఫీసు స్థలాలకు, బిల్డింగులకు కూడా గిరాకీ పెరుగుతుందట. ప్రస్తుతం ఐటీ కంపెనీల నియామకాలు జోరుగా ఉన్నందున ఆఫీసు స్థలానికి కూడా రాబోయే ఏడాది గిరాకీ పెరుగుతుందట. 2021లో 5 పెద్ద ఐటీ కంపెనీలు 2.60 లక్షల మందిని నియమించుకున్నాయి.
వీరంతా ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. వీరంతా ఆఫీసులకు వస్తే అదనంగా 1.16 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలం కావల్సి ఉంటుందట. ఇక, కరోనా నేపథ్యంలో ఇ-కామర్స్ సేవలు కూడా విస్తరించారు. దీంతో, వారికి కావాల్సిన గోడౌన్ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో 2023 నాటికి 4.59 కోట్ల చదరపు అడుగుల గోడౌన్ల స్థలం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు అవసరమని అంచనా.