జగన్ పాలనలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం గత రెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం టెండర్లు పిలిచిందని రోడ్లు, భవనాలను అప్పు సప్పు చేసి మరీ నిర్మించిన కాంట్రాక్టర్లు చివరకు బిల్లులు రాకపోవడంతో కుదేలయ్యారు. 2019 జనవరి నుంచి చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్డీల భారం పెరిగిపోతోందని, ఆర్థికంగా చితికిపోతున్నామని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ కాంట్రాక్టర్ తాను నిర్మించిన అంగన్ వాడీ కేంద్రానికి ఏకంగా తాళం వేసి నిరసన తెలిపిన ఘటన వైరల్ అయింది. ఇదే తరహాలో మరో పాఠశాల భవనానికి కూడా వేరే కాంట్రాక్టర్ తాళం వేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇక, తమ బిల్లులు చెల్లించాలంటూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కాంట్రాక్టర్లు మున్సిపల్ కార్యాలయం లోపలా, బయటా ఫ్లెక్సీలు అంటించారు. తమ బిల్లులు చెల్లించి, తమ ప్రాణాలు కాపాడాలని వారు ఫ్లెక్సీలో ప్రింట్ చేయించడం వైరల్ అయింది.
ఈ కోవలోనే తాజాగా వైఎస్సార్ జలకళ కాంట్రాక్టర్ల సంఘం కూడా తమ గోడు వెళ్లబోసుకుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ సంఘం అనంతపురం ప్రతినిధులు రాసిన లేఖ వైరల్ అయింది. జిల్లావ్యాప్తంగా ముగ్గురు కాంట్రాక్టర్లు కలిసి 600కు పైగా బోర్లు డ్రిల్లింగ్ చేశామని, వాటికి సంబంధించి గత 8 నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము మధ్యతరగతి కాంట్రాక్టర్లమని, తక్షణమే బిల్లులు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు వాపోయారు. తమకు డబ్బులిచ్చినవారు, మెటీరియల్ ఇచ్చినవారు డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో విజయవాడలోనే అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, మొఖం చెల్లక సొంత ఊరికి వెళ్లడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరి, ఈ లేఖ చూసైనా ప్రభుత్వం మనసు కరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.