ఈ నెటిజన్ వేసింది జోక్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది పచ్చివాస్తవం. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని బాత్ రూంలు ఉంటే అన్ని బాత్రూంలకు రోజుకు రూపాయి చొప్పున నెలకు 30 రూపాయలు ప్రభుత్వానికి పన్ను కట్టాలి. అయితే, ఇది పట్టణాలకు సంబంధించిన కొత్త ట్యాక్స్. కర్మ ఏంటంటే… 60 శాతం ఆంధ్ర జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేయడం కొత్తకాదు. అనేక రూపాల్లో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలకు ఉన్న ప్రధాన మార్గం పన్నులే కనుక.. వీటిని ప్రజలు కష్టమైనా నష్టమైనా భరించక తప్ప దు. అయితే.. రానురాను.. ఈ పన్నులకు ఒక తీరు-తెన్ను లేకుండా పోతుండడమే చిత్రంగా అనిపిస్తోంది. మరీముఖ్యంగా ప్రజలు కడుతున్న పన్నులను వివిధ సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు పందేరం చేస్తున్నారు ఏపీ నాయకుడు జగన్.
ఏపీలోని జగన్ ప్రభుత్వం.. వింత వింత పన్నులను తెరమీదికి తెస్తోంది. ఇప్పటికే మద్యం ధరలపై స్థానిక పన్నులు కుమ్మేసింది. ధరలు పెంచుతూనే.. వాటిపై వ్యాట్ వేసింది. ఇక, విద్యుత్ ధరలు పెంచుతూ.. వాటికి సుంకాలు విధించేసింది.
అదేసమయంలో స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్ ధరలను కూడా అమాంతం పెంచేసింది. ఇలా ఒకటి కాదు.. అనేక రూపాల్లో పన్నులు పిండేస్తోంది. ఈ క్రమంలోనే ఇంటి పన్నులను పెంచుతూ.. పురపాలక శాఖ కూడా తన తరఫున జగన్ ఖజానాకు 150 కోట్లను అదనంగా అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇదిలావుంటే.. మునిసిపాలిటీల్లో చిత్రమైన పన్నులు తెరమీదికి తెచ్చారు అధికారులు. దీనికి సర్కారు వారు కూడా పచ్చజెండా ఊపారు.
ఇదేంటంటే.. ఇప్పటి వరకు.. బాత్ రూంలపై పన్ను అనేది చరిత్రలో ఎవరూ ఎన్నాడూ వేయలేదు. కేవలం డ్రైనేజ్ కనెక్షన్ కు మాత్రమే పన్ను వేశారు. జగన్ ఏం చేసినా చరిత్ర సృష్టిస్తారు. అందుకే భారతదేశ చరిత్రలో తొలిసారి.. మరుగుదొడ్లకు పన్ను వేయనున్నారు జగన్ రెడ్డి.
చరిత్రలో జుట్టుపై పన్ను వేసినట్టు చదువుకున్నాం(పై ఫొటోలో చదవండి). ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా మనకు వైఎస్ జగన్ రెడ్డి వింత పన్నులు వేసి ఆనాటి ఔరంగజేబును గుర్తుకు తెచ్చారు. ఎందుకంటే ఇకపై ఇళ్లలోని బాత్రూంలలో కమోడ్ల సంఖ్యను బట్టి పన్నులు విధించనున్నారు. ఉదాహరణకు ఒక డబుల్ బెడ్ రూం ఫ్లాట్‌ను తీసుకుంటే.. ఒక జనరల్ బాత్ రూంతోపాటు.. ఒక అటాచ్డ్ బాత్ రూం తప్పనిసరి. అయితే.. సీవరేజ్ కనెక్షన్ మాత్రం ఒకటే ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఇలాంటి వాటికి చెక్ పెట్టి.. ఎన్ని కమోడ్ లు వినియోగిస్తున్నారో.. ఇంటింటికీ తిరిగి సర్వే చేసి.. కమోడ్ల వారీగా పన్ను విధించేందుకుఅధికారులు సిద్ధమయ్యారు. దీనికి సర్కారు నుంచి కూడా ఆమోదం లభించింది. మొత్తానికి పన్నుల బాదుడులో ఇదో వింత వైఖరి అంటున్నారు పరిశీలకులు.
ఇదీ.. పన్నుల బాదుడు..
+ సీవరేజ్ కనెక్షన్లను 3 రకాలుగా విభజించారు.
+ గృహ కనెక్షన్లకు.. 2 కమోడ్లు ఉంటే..నెలకు రూ.30-35
+ గృహ కనెక్షన్లకు 3 కమోడ్లు ఉంటే.. ఒక్కొక్క దానికీ నెలకు రూ.60-80
+ 3 కమోడ్లకు మించిన గృహ కనెక్షన్లకు ఒక్కొక్క దానికీ రూ.10 అదనపు పన్ను విధిస్తారు.
+ కమర్షియల్ కనెక్షన్లకు (3 కమోడ్లు ఉంటే) రూ.150-250
+ 3 కమోడ్ల కంటే ఎక్కువగా ఉంటే ఒక్కొక్కదానికీ అదనంగా రూ. 25
+ విద్యాసంస్థలు, మఠాలు, ఆసుపత్రులు, హోటళ్లకు 10 కమోడ్ల లోపు: రూ.300-600
+ వీటిలోనూ 10 కంటే ఎక్కువ కమోడ్లు ఉంటే.. ఒక్కొక్క దానికీ రూ.15 అదనంగా పన్ను వసూలు చేస్తారు.