ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. కానీ.. ఒకరి తర్వాత ఒకరు చొప్పున పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురి కావటం ఇప్పుడు అర్థం కాని ఫజిల్ లా మారింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు.. ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి కేసులు ఒకటో.. రెండో కాకుండా ఇప్పటికి వంద కేసుల వరకు నమోదు కావటం గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. అసలేమైందన్న విషయంపై స్పష్టత రాని పరిస్థితి. వంద మందిఅనారోగ్యానికి గురైతే.. వారిలో 95 మందిని ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి వైద్యం ఇస్తున్నారు.
శనివారం సాయంత్రం నుంచి ఏలూరులోని వన్ టౌన్ కు చెందిన పలు ప్రాంతాల్లోని వారు హటాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. అర్థరాత్రి పన్నెండు గంటల సమయానికి దాదాపుగా 100కు పైగా కేసులు ఇదే తరహాలో ఆసుపత్రికి వస్తున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్న వారు హటాత్తుగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. వెంటనే వారికి ఆక్సిజన్ ఇస్తే కోలుకుంటున్నారు. శనివారం అర్థరాత్రి వరకు ఈ తరహాలో అనారోగ్యానికి గురైన 95 మందిని ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేస్తున్నారు. వికారం.. మానసిక ఆందోళనకు గురవుతుండటంతో ప్రజలకుఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
ఇదిలా ఉంటే.. ఏలూరులో చోటు చేసుకున్న అనారోగ్య కేసుల గురించి సమాచారం అందుకున్న మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని బాధితుల్ని పరామర్శించారు. ఈ కేసులు ఎక్కువగా వస్తున్న దక్షిణ వీధికి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. అక్కడి వారికి సరఫరా చేసే తాగునీరు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రత్యేకంగా శానిటేషన్ చేస్తున్నారు. ఈ పరిణామంపై జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్ని విజయవాడకు పంపారు. వీటి ఫలితాలు ఆదివారం రానున్నాయి.
ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయాన్ని వైద్యులు సైతం చెప్పలేకపోతున్నారు. గడిచిన మూడు రోజులుగా రంగు మారిన నీళ్లు వస్తున్నాయని.. వాటిని తాగటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. అయితే.. అనవసరమైన ఆందోళన వద్దని.. ఎలాంటి పరిస్థితులకైనా ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్నారు. ఏలూరుకు అసలేమైంది? అన్నది మాత్రం ప్రశ్నగానే ఉంది. మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం లభించొచ్చని ఆశిస్తున్నారు.