ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారా? ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై.. వారు తీవ్రంగా రగిలిపోతు న్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ప్రభుత్వం కూడా ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. తదనంతరం.. జరిగిన ఆందోళనలు.. వంటివాటిపై ఇంటిలిజెన్స్ నివేదిక తెప్పించుకున్నట్టు ప్రబుత్వ వర్గాలలోనూ గుసగుస వినిపిస్తోంది.
ఈ నివేదికలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు.. ముఖ్యంగా వైసీపీ ఎవరిని తమ ఓటు బ్యాంకుగా భావిస్తోందో.. వారే.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకతతోను, ఆగ్రహంతోనూ ఉన్నట్టు పేర్కొన్నారని.. అంటున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
గత నెల 19వ తేదీన.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ అదినేత చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఈ క్రమంలోనే ఆయన సతీమణిపైనా.. ఆయన కుమారుడు లోకేష్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “లోకేష్ ఎలా పుట్టాడు“ అనే కామెంట్లు ఆఫ్ దిరికార్డుగా వినిపించాయి.
అదే సమయంలో కొందరు తమ సీట్ల వద్దకు వచ్చి మరీ.. భువనేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారని.. దారుణంగా మాట్లాడారని.. టీడీపీ నాయకులు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ అవమానం భరించేలేనని.. ఇది గౌరవ సభకాదు.. కౌరవ సభ.. అంటూ.. సభ నుంచి వాకౌట్ చేసిన చంద్రబాబు.. తిరిగి తాను ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగు పెడతానని శపథం చేశారు.
ఆ వెంటనే జరిగిన ఘోరాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ.. ఆయన బోరున విలపించారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించారు. ఆ తర్వాత ఏకంగా.. నందమూరి కుటుంబం కూడా మీడియా ముందుకు వచ్చింది. బాలయ్య అంటే.. ఎమ్మెల్యే ఆయన ఎప్పుడూ.. మీడియా ముందుకు వస్తుంటారు. కానీ, ఇంటికే పరిమితమైన మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులు కూడా తొలిసారి మీడియా ముందుకు వచ్చి.. అన్నగారి ఇంటి ఆడపడుచును ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు వారు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే.. అప్పట్లో వీటిని లైట్ తీసుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యేలు.. ఇప్పుడు మాత్రం సీరియస్‌గానే భావిస్తున్నారు. జరిగిన దానికి తాము చింతిస్తున్నామంటూ.. వ్యాఖ్యలు చేస్తున్నారు.
కొన్ని రోజుల కిందట అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువు వంటి.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ ఛానెల్ వేదికగా.. భువనేశ్వరి తనకు అక్కలాంటిదని.. క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
అదేసమయంలో.. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. ఏకంగా.. తమ కన్నీళ్లతో.. భువనేశ్వరి పాదాలు కడుగుతామన్నారు.
ఇక, ఇటీవల ఆ సమయంలో సభలో ఉన్న(ఈయన కూడా దూషించారని టీడీపీ నేతలు అంటున్నారు) అంబటి రాంబాబు కూడా.. ఓ వీడియో విడుదల చేశారు. దానిలో భువనేశ్వరికి సారి చెబుతున్నానని అంటున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు చూస్తే.. వైసీపీలో బింకం కాస్తా సడలుతోంది.
ఒక వైపు.. సభలో వైసీపీ ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ.. చంద్రబాబు.. గ్రామస్థాయిలో గౌరవ సభలను నిర్వహిస్తూ.. సభలో ఏం జరిగిందో క్షేత్రస్థాయికి తీసుకువెళ్తున్నారు. దీంతో మహిళల పట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని, అన్న నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచునే అవమానిస్తారా? అని గ్రామస్థాయిలో మహిళలు చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కీలకమైన ఓటు బ్యాంకుకు సెగ పెరిగే అవకాశం ఉందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా ఈ విషయంలో వెనక్కి తగ్గిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి మున్ముందు.. ఏం జరుగుతుందో చూడాలి.