ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆశ్చర్యపరిచే పరిణామం ఎదురైంది. ప్రస్తుతం ఇక్కడి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వారు నెల్లూరు అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్లో బస చేశారు.
నిజానికి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర సాగినప్పుడు.. వైసీపీ ఎమ్మెల్యే అసలు ఇక్కడ పాదయాత్రను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. పాదయాత్రలో పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారని.. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
కానీ, ఇప్పుడు అనూహ్యంలో నెల్లూరులో మాత్రం రైతుల వద్దకు అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వచ్చారు.
ఆయన్ను చూసి అమరావతి రైతులు మొదట నివ్వెరపోయారు. అనంతరం ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అంబాపురం మీదుగా వెళ్తున్న సమయంలో.. అక్కడ వెంకటేశ్వరస్వామి రథంతో పాటు వాహనాలు కనిపించటంతో తన అనుచరుల్ని అడిగారు. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు ఇక్కడే బస చేశారని అనుచరులు చెప్పారు.
మన ప్రాంతానికి వచ్చిన అతిథుల్నిపలకరిద్దామంటూ… ఆయన తన వాహనం దిగి ఫంక్షన్ హాల్లోకి వెళ్లారు. ఆయన్ను గుర్తుపట్టిన అమరావతి రైతులు నమస్కారం చేసి లోపలకు ఆహ్వానించారు. వారికి ప్రతి నమస్కారం చేస్తూ ఎలా ఉన్నారని రైతుల్ని అడిగారు.
తన నియోజకవర్గం మీదుగా వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ అవసరం వచ్చినా చెప్పాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు జై అమరావతి అనాలని కోరగా సున్నితంగా తిరస్కరించారు.
ఆ మాట అనేందుకు తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నయని చెప్పారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతి రైతుల పాదయాత్రను విమర్శిస్తున్న తరుణంలో… అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతుగా మాట్లడటంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
అయితే.. కోటంరెడ్డి రాక వెనుక.. ఏదైనా వ్యూహం ఉందేమో.. అనే భావన మాత్రం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. కోటంరెడ్డి జగన్‌కు ఎంతో సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.