ఏపీలో సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. పలువురు వైసీపీ నేతలు తమ వ్యాపారాల అభివృద్ధి కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలకు ఊతమిచ్చే ఉదంతం ఒకటి విశాఖలో వెలుగుచూసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ‘వాసుపల్లి గణేష్ కుమార్’ సొంత కాలేజీలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సంచలనం రేపాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలోని తెలప్రోలు వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ముక్కుపిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనకు దిగారు. అదనంగా ఫీజులు చెల్లించకుంటే టీసీ ఇవ్వబోమని యాజమాన్యం బెదిరిస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనను అధికారులు పట్టించుకోవడంలేదని అంటున్నారు. కాలేజీలో కనీస సదుపాయాలు లేవని, చదువే చెప్పకుండా ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ పేరిట అడ్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు వైజాగ్ జూనియర్ కాలేజ్ అని కొందరికి టీసీలు ఇస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు, గత 3 సంవత్సరాల నుండి అనుమతులు లేకుండా కాలేజీ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు కోరుతున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి ఆ తర్వాత వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ‘సరోజినీ ఇంజనీరింగ్ కాలేజీ’ పేరుతో ‘వాసుపల్లి గణేష్’ , ఆయన కుటుంబ సభ్యులు పలు విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తన పలుకుబడిని ఉపయోగించిన రమేష్…రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండానే ఆయా కాలేజీలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖ, హైదరాబాద్ లలోనూ ఈ తరహాలోనే కాలేజీలు నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ‘సరోజినీ ఇంజనీరింగ్ కాలేజీ’ 14 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, రూ.4000 చ.గ మార్కెట్ వ్యాల్యూకు ఆ భూమిని సొంతం చేసుకున్నారని ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఆ భూమి విలువ దాదాపు 30 కోట్లు ఉంటుందని, రిజిస్ట్రేషన్ ఫీజు 12 శాతాన్ని కూడా రమేష్ చెల్లించలేదని ఆరోపణలున్నాయి. రూ.4 కోట్లు రిజిస్ట్రేషన్ ఫీజుకు బదులుగా కేవలం రూ.1000 చెల్లించారని ఆరోపణలున్నాయి. ఒక్క విశాఖలోనే కాకుండా మిగతా కాలేజీల విషయంలోనూ ఇలాగే రమేష్ చేశారని ఆరోపణలున్నాయి.