అంతా భాంత్రియేనా.. ఈ జీవితానా వెలుగింతేనా..ఎవర్ గ్రీన్ పాట.. కష్టాల్లో ఉన్న తెలుగోడు కనీసం ఒక్కసారైనా మనసారా పాడుకునే పాట ఇది.. ప్రస్తుతం టీఆర్ఎస్లో ముగ్గురు నేతలు కూడా ప్రస్తుతం ఇదే పాట పాడుకుంటున్నారని చెప్పక తప్పదు.
ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన వీరు.. తెలంగాణాలో టీడీపీ కనుమరుగయ్యాక చివరకు టీఆర్ఎస్లో చేరారు. ఇలాగైనా మరికొంత కాలం తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలనేది వారి తపన. కానీ.. కేసీఆర్ తాజా నిర్ణయంతో ఈ ముగ్గురూ డీలా పడిపోయారు. ఎమ్మెల్సీగా ఎన్నికవదామనుకున్న వారి కలలన్నీ కల్లల్లయ్యాయి.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను కేసీఆర్ ప్రకటించారు. రవీందర్రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నరసింహులు, ఎల్. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి ముగ్గురికి చుక్కెదురైంది. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెడుతామని ఆశల పల్లికిలో ఊరేగారు. ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఉట్టికి స్వర్గానికి మధ్యలో ఉన్నారు.
ఈటల రాజేందర్ కమలం గూట్లో కూర్చోవడంతో.. భవిష్యత్తును ముందుగానే ఊహించిన పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీగా తనను కేసీఆర్ మండలికి పంపుతారని గంపెడాశలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈటలకు పోటీగా హుజురాబాద్ లో చక్రం తిప్పాలని ఆయన భావించారు. అయితే పెద్దిరెడ్డి ఆశలకు కేసీఆర్ తుంచేశారు.
ఇక మోత్కుపల్లి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. హుజురాబాద్ విజయంతో రాష్ట్రంలో బీజేపీ జవసత్వాల వచ్చాయి. కాషాయాన్ని కాదని మోత్కుపల్లి గులాబీ రంగును అద్దుకున్నారు. ఈటల గెలుపుతో బీజేపీకి ఓ బ్రేక్ వచ్చినట్లయింది. తెలంగాణలో సరైన నాయకుడుంటే ఇక బీజేపీకి తిరుగులేదనే వాదన ఒకటి ప్రచారంలో ఉంది.
ఇలాంటి సమయంలో మోత్కుపల్లి పప్పులో కాలేశారనే విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మోత్కుపల్లికి గులాబీ బాస్ తగిన ప్రాధాన్యత ఇస్తారని అందరూ అనుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేస్తారని భావించారు. అయితే మోత్కుపల్లికి కేసీఆర్ నిరాశే మిగిల్చారు.
ఇక దళిత బంధు పథానికి ఆయనను చైర్మన్ చేస్తారనే ఓ ప్రచారం కూడా ఉంది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత దళిత బంధు పథకం పున:ప్రారంభంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆ ఆశపై కూడా కేసీఆర్ నీళ్లు చల్లినట్లయింది. అసలే మోత్కుపల్లి నోరు మహా చెడ్డదని అందరూ అంటుంటారు. అలాంటి నేత ఇంత జరుగుతున్న ఎందుకు మౌనంగా ఉన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మూడో వ్యక్తి ఎల్. రమణ. రమణను పెద్దిరెడ్డిని హుజురాబాద్ లో ఈటలను ఓడించాలని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని అప్పట్లో జరిగిన ప్రచారం. రమణను ఎమ్మెల్సీ ఆఫర్ చూపెట్టి టీఆర్ఎస్ లో కేసీఆర్ చేర్చుకున్నారని చెబుతున్నారు. ఆయనకు తప్పకుండా కేసీఆర్ న్యాయం చేస్తారని అందరూ అనుకున్నారు.
హుజురాబాద్ ఎన్నికల తర్వాత రమణను ఎమ్మెల్సీని చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో రమణకు మొండిచేయి చూపారు. ఈ ముగ్గురిని హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయింది.
ఇక వీళ్లతో పనిలేదనే కేసీఆర్ అనుకున్నారో ఏమో.. అందువల్లే వీరిని పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే మోత్కుపల్లి, పెద్దిరెడ్డికి ఏమో కాని రమణకు మాత్రం కేసీఆర్ మంచి పదవే కట్టబెడుతారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో ఎంత వాస్తవ ఉందో కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైన ప్రస్తుతం ఈ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.