ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సత్తా చాటుతోంది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకొని వైసీపీకి షాకిస్తోంది. ముఖ్యంగా వైసీపీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లోనూ టీడీపీ జెండా ఎగరడంతో వైసీపీ నేతలకు భంగపాటు తప్పడం లేదు. నిన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బుగ్గనకు షాక్ తగలగా..తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గం తాడికొండలో ఎదురుదెబ్బ తగిలింది.
తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిపురం మండలంలోని 2ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ 2 స్థానాలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. గుండాలపాడులో 457 ఓట్లు, వేమవరం 93 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఓటమి తర్వాత శ్రీదేవికి వైసీపీ పెద్దల నుంచి ఫోన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఓటమిపై శ్రీదేవి ఇప్పటివరకు స్పందించలేదు.
దీంతోపాటు, కృష్ణా జిల్లాలో వైసీపీ నేత జోగి రమేష్‌కి పెడన ప్రజలు షాకిచ్చారు. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్లతో గెలుపొందారు. అలాగే పామిడి మండలం గజరాంపల్లి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి రామలక్ష్మి 202 ఓట్లతో గెలిచారు. మరోవైపు, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు ప్రజలు షాకిచ్చారు. ఎమ్మెల్యే సొంత మండలం శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 1046 ఓట్లు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి హైమావతి గెలిచారు. జడ్పీటీసీ ఎన్నికను మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాలుగా తీసుకొని మరీ పార్టీని గెలిపించారు.
ఇక, పోలవరం మండలం కొరుటూరు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి అరగంటి పెంటమ్మ 429 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. పెదవేగి మండలం రామశింగవరం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి 27 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ, యథా ప్రకారం నిన్నటిలాగే వైసీపీ అభ్యర్థి రీ కౌంటింగ్ కు పట్టుబట్టి గందరగోళం చేశారు.
శ్రీకాకుళం జిల్లా హిరమండలం జడ్పీటీసీ స్థానం టీడీపీ సొంతమైంది. టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబుకు 89 ఓట్లతో గెలిచారు. అంతకుముందు హిర మండలం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ ఒత్తిడితో రీకౌంటింగ్‌కు అధికారుల సన్నాహాలు చేశారు. అయితే రీకౌంటింగ్ కుదరదంటూ టీడీపీ నిరసనకు దిగింది. అక్కడకు ఎమ్మెల్యే వెంకటరమణ రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.