తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేడుకలు నేడు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. 9వసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా…20 ఏళ్ల టీఆర్ ఎస్ ప్రస్థానాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఎన్నో అపనమ్మకాల మధ్య పార్టీ ఏర్పడిందని, సమైక్య పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారని కేసీఆర్ తన పాత శైలిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని సమైక్య పాలకులు అపోహాలు సృష్టించారని, ప్రస్తుతం తెలంగాణలో కరెంటు ఉందని, ఏపీలో కరెంటు కోతలున్నాయని ప్రాంతీయ భావాన్ని మరోసారి తట్టి లేపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి కేసీఆర్…ఆంధ్రా పాలకులను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని నెటిజన్లు చురకలంటించారు.
20 ఏళ్ల టీఆర్ఎస్ సంబరాలు అట్టహాసంగా చేసుకుంటున్నామని,కానీ, ఆంధ్రాపాలకులు దోపిడీదారులు, దొంగలు అని తిట్టిన కేసీఆర్….నేడు అదే ఆంధ్ర పాలకులు స్థాపించిన హైటెక్స్ లో ప్లీనరీ పెట్టారని సెటైర్లు వేస్తున్నారు. విజన్ ఉన్న లీడర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2003లో ఎంతో ముందు చూపుతో హైటెక్ సిటీ నిర్మించారని, ఈనాడు హైటెక్ సిటీ తెలంగాణకే తలమానికమైందని గుర్తు చేస్తున్నారు.
అటువంటి హైటెక్స్ ప్రాంగణమే ప్లీనరీకి దిక్కయిందని, గత ఏడేళ్ళల్లో బంగారు తెలంగాణ అంటూ సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి టీఆర్ఎస్ ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, 2023 ఎన్నికలు వస్తే మరోసారి ఆంధ్రావాళ్ళు దొంగలు అని అమాయక తెలంగాణ జనాల్లో ఆవేశాలు, సెంటిమెంటును కేసీఆర్ రెచ్చగొడతారని ట్రోలింగ్ చేస్తున్నారు.
గెలవక ముందు మాయమాటలు చెప్పడం, గెలిచాక స్వార్థంతో ఏకపక్షంగా దోచుకోవడం, పబ్బం గడుపుకోవడం కేసీఆర్ కు పరిపాటని చురకలంటిస్తున్నారు. ఇది తప్ప కేసీఆర్ ప్రజలకు చేసింది శూన్యం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయం తెలిసినా తప్పక పార్టీలో ఉంటున్న కొందరు నిజాయితీపరులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, పార్టీ శ్రేణులు సిగ్గుతో చచ్చిపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు కట్టించిన హైటెక్స్ లో నిల్చొని ఆయనపైనే విమర్శలేంది సారూ? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.