తెలుగు దర్శకుడు ఒకరు సినిమా తీస్తున్నారంటే.. ఆ సినిమా విడుదల కోసం యావత్ దేశమే కాదు.. దేశంలోని అన్ని వుడ్ లు ఒక కన్నేసి ఉంచడం సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం అడిగితే.. రాజమౌళి అని చెబుతారు. తన బాహుబలి మూవీతో దేశీయంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ఆయన.. తర్వాతి మూవీ ‘ఆర్ఆర్ఆర్’ అన్న సంగతి తెలిసిందే.
సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీని రానున్న సంక్రాంతికి వారం ముందు విడుదల చేయటానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్టు ఈ మధ్యనే పూర్తి చేయటం తెలిసిందే. చిత్ర కథానాయకులు తారక్.. చెర్రీలు తమ డబ్బింగ్ పార్టును కూడా పూర్తి చేయటం జరిగింది. ఇప్పుడు అసలు కసరత్తుకు తెర లేచిందంటున్నారు.
ఎందుకంటే.. సినిమాను ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత చూస్తే.. మొత్తం 3 గంటలకు పైగా ఉందట. దీన్ని 2.45 గంటలకు కుదించటానికి పెద్ద కత్తెర పట్టుకోవటానికి రాజమౌళి సిద్ధమవుతున్నారట. ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేయటం ఒక ఎత్తు అయితే.. తాను అనుకున్నంత రన్ టైంకు చిత్రాన్ని కుదించటం ఇప్పుడు అతి పెద్ద సవాలుగా చెబుతున్నారు. ఏళ్ల తరబడి జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ శిల్పాన్ని ఫైనల్ షేపులోకి తీసుకురావటం మామూలు విషయం కాదన్న మాట వినిపిస్తోంది.