జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక, ఫుల్లుగా పాలిటిక్స్‌కే తన కాల్ షీట్లను పరిమితం చేయనున్నారు. ఇప్పటి వరకు ఆయన తనకు కుదిరిన సమయంలో పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయించిన పవన్.. ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించారు.
తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని.. ఇటీవల కాలంలో చెబుతూ వచ్చిన పవన్.. నిజానికి ఆ సమయం లో ఆయన ఎంత నమ్మించాలని ప్రయత్నించినా.. ఫలించలేదు.
ఎందుకంటే… గడిచిన రెండున్నరేళ్లుగా కూడా పవన్.. రాజకీయా లకు కేటాయిస్తున్న సమయం చాలా చాలా తక్కువ. దీంతో విజిటింగ్ నాయకుడనే పేరుతో అధికార పార్టీ వాళ్లు పవన్‌ను పిలవడం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా పవన్.. ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అంటే.. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ.. తాను పర్యటించాలని ఆయన నిర్ణయించారు. ప్రతి జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు.. ప్రతి అంశంపైనా పోరాటం మరింత ఉధృతం చేస్తామని.. ఆయన చెప్పారు.
అంతేకాదు..తమది ప్రజాపక్షమని పవన్ చెప్పడం ద్వారా.. ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లి.. వారి నుంచి సానుభూతిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే వాదనను వెలుగులోకి తెచ్చారు. నిజానికి ఏ పార్టీకైనా ఇలాంటి వ్యూహం కావాల్సిందే. సింపతీ లేని రాజకీయాలు ఎక్కడా సక్సెస్ కాలేదు. సో.. పవన్ విషయంలోనూ ఇది అవసరమే.
ఇక, ఇదేసమయంలో శ్రమదానం స్ఫూర్తిని మరింతగా కొనసాగించాలని పవన్ నిర్ణయించారు. అక్టోబరు 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం కార్యక్రమం చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి.. జనసేనకు మధ్య వివాదాలు రావడం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు ఇదే స్ఫూర్తి ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మండలాలు, జిల్లాల స్థాయిలో ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ శ్రమదానం చేసేందుకు పార్టీ నాయకులు వెరవకూడదని ప్రకటించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే వ్యూహం ఉందని అంచనాలు వస్తున్నాయి.
ఇది కూడా మంచి పరిణామమనే అంటున్నారు. పైకి ఎన్ని డైలాగులు పేల్చినా.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోకపోతే.. ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. సో.. ఇప్పటికైనా.. పవన్ ఆదిశగా అడుగులు వేయడాన్ని పార్టీ అభిమానులు స్వాగతిస్తున్నారు.
ఇక, జిల్లాల పర్యటనలో పవన్ ఏం చేస్తారు? ఏయే సమస్యలను ఆయన టార్గెట్ చేసుకుని మాట్లాడతారు? ఓటు బ్యాంకు సమీకరణకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? వంటి అంశాలు ఆసక్తిగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.