- ‘చిల్లర’ రాజకీయాలు ఐపీఎస్‌కు ఎందుకు?
- దిశ చట్టం లేదని చెప్పడానికి రెండేళ్లా?
- రేపిస్టులను పట్టుకోలేక మీడియాపై అక్కసు
- సవాంగ్ తీరుపై పోలీసు అధికారుల విస్మయం
నవ్యాంధ్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలు రాజకీయ పార్టీల నుంచే కాదు.. పోలీసు వర్గాల నుంచీ వస్తున్నాయి. వైసీపీ చెప్పినట్టల్లా ఆయన ఆడుతున్నారని విపక్ష టీడీపీ విరుచుకుపడుతోంది. ఆయన తీరు, వ్యాఖ్యలు అఖిల భారత అధికారుల స్థాయిలో లేవని రిటైర్డ్ పోలీసు అధికారులు కూడా అంటున్నారు.
రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినా.. కనీసం అలా కనిపించాలన్న వివేకం కూడా ఆయనలో నశించిందని ఆక్షేపిస్తున్నారు. ఎన్ని సార్లు హైకోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడినా ఆయనకు సిగ్గనిపించడం లేదని.. పదే పదే అవే తప్పులు చేస్తున్నారని మండిపడుతున్నారు. కోర్టులను కూడా తప్పుబట్టే స్థితికి దిగజారారని అంటున్నారు.
రాజకీయాంశాల్లో అనవసరంగా తలదూర్చి.. అధికార పార్టీ ప్రతినిధిలా స్పందిస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. ఉదాహరణకు.. దిశ చట్టమే తీసుకుందాం. తెలంగాణలో కామాంధుల ఉన్మాదానికి బలైన ఓ యువతి పేరిట ఆంధ్రప్రదేశ్‌లో ఈ బిల్లును హడావుడిగా తీసుకొచ్చారు. కేంద్రం జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన నిర్భయ చట్టంలోని నిబంధనలను కూడా తోసిరాజనేలా దీనిలో నిబంధనలను పొందుపరిచారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా రూపకల్పన చేశారు. అసెంబ్లీలో మందిబలం ఉంది కాబట్టి ఆమోదింపజేసుకున్నారు.
భారత శిక్షాస్మృతి(ఇండియన్ పీనల్ కోడ్-ఐపీసీ)లో సవరణలు చేసే అధికారం తనకు లేకపోయినా రాష్ట్రప్రభుత్వం ఇందుకు సాహసించడాన్ని సవాంగ్ అడ్డుకోలేకపోయారు. దిశ చట్టం ప్రకారం.. అత్యాచార ఘటన జరిగి.. కేసు నమోదైన వారంలోగా కోర్టులో చార్జిషీటు వేయాలి. దానిపై 21 రోజుల్లో విచారణ పూర్తయి.. శిక్షలు పడాలి. ఇవి సాధ్యమేనా? ఆచరణాత్మకంగా అనేక లోపాలు ఉండబట్టే కేంద్రం ఇంతవరకు ఆమోదించలేదు. అనేక సందేహాలు వ్యక్తంచేస్తోంది. దానికి జగన్ సర్కారు సంతృప్తికరంగా జవాబివ్వలేకపోతోంది. పైగా ఈ రెండేళ్లలో జరిగిన అత్యాచార ఘటనల్లో ఒక్క కేసులో కూడా వారం రోజుల్లోగా చార్జిషీటు సంగతి దేవుడెరుగు.. నిందితులనే అరెస్టు చేసిన పాపాన పోలేదు.
సీఎం నివాసానికి కూతవేటు దూరంలో తాడేపల్లి కృష్ణాతీరంలో ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను 3నెలలు కావస్తున్నా అరెస్టు చేయలేదు. దీనిపై ప్రతిపక్షం ఆందోళనకు దిగితే ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఉనికిలోనే లేని దిశ చట్టం ఆధారంగా దిశ పోలీసు స్టేషన్ల ఏర్పాటు తగదని ప్రభుత్వానికి డీజీపీ చెప్పలేకపోయారు. పైగా వాటి ప్రారంభోత్సవానికి ఆయనే వెళ్లడం హాస్యాస్పదంగా ఉంది. అన్నిటినీ మించి ఈ చట్టం కింద దాఖలైన కేసుల్లో ముగ్గురికి ఉరి శిక్ష పడిందని. ఐదుగురికి యావజ్జీవ శిక్ష పడిందని హోం మంత్రి సుచరిత ప్రకటించారు.
లేని చట్టం కింద శిక్షలు పడవన్న సంగతి ఆమెకు తెలియదని అనుకుందాం. డీజీపీకి తెలుసు కదా! ఆయనెందుకు వివరణ ఇవ్వలేదు. ఇదే ప్రశ్న మీడియా అడిగితే.. కోర్టులను అడగాలని ఆయన బదులిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పిన విధంగా 21రోజుల్లో ఎంతమందికి శిక్ష పడిందని అడుగగా.. దానికి ప్రత్యేక కోర్టులు అవసరమని.. ప్రభుత్వం చేయాల్సిన పని చేసిందని, కోర్టుల ఏర్పాటు కోసం న్యాయవ్యవస్థకు ప్రభుత్వం లేఖ రాసిందని వాటిని తప్పుపట్టే ప్రయత్నం చేశారు.
బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చకుండా దాని కింద కోర్టులు విచారణ జరపవన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేకపోవడం గమనార్హం. 21 రోజుల్లో శిక్షలు వేస్తామని కోర్టులు ఎప్పుడైనా చెప్పాయా? ఆ వ్యవధిలో శిక్షలు పడేలా చేస్తామని ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ, వైసీపీ మంత్రులు పదేపదే చెప్పారు. అసెంబ్లీలో చట్టాలు చేశామని చెప్పారు.
చట్టం తెచ్చినందుకు మహిళా ఎమ్మెల్యేలతో సన్మానాలు చేయించుకుని ఫొటోలు వేయించుకున్నారు. ఇప్పుడు కోర్టులను అడగమని చెప్పడం ఏమిటి? దిశ చట్టం అమల్లో లేదని గుంటూరు ఎస్పీ ధైర్యంగా చెప్పారు. డీజీపీ ఆ మాట చెప్పలేకపోయారు. ఆయన తన మాటలతో, చర్యలతో తన సొంత శాఖ పరువు తీస్తున్నారని సీనియర్ అధికారులు అంటున్నారు.
డీజీపీకే చట్టాల గురించి తెలియకపోతే ఆ శాఖలో ఇతరులకు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తే సరికి కొద్ది రోజుల కింద దిద్దుబాటకు డీజీపీ ప్రయత్నించారు. ‘దిశ’ అనేది చట్టం కాదని.. మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమమని సావకాశంగా సెలవిచ్చారు. ఇదే విషయం హోం మంత్రికి చెప్పి ఉంటే మీడియా ఎదుట ఆమె అబద్ధం చెప్పి ఉండేవారు కాదు కదా!
తాడేపల్లి రేప్ కేసులో నిందితులను పట్టుకోలేకపోవడానికి మీడియా కారణమని కొత్తగా ఆరోపణలు చేశారు. నిందితుల ఫొటోలను పత్రికలు ప్రచురించాయని.. అందుకే అరెస్టులో జాప్యం జరుగుతోందని చెప్పారు. దానికీ దీనికీ ఏం సంబంధమో అర్థమే కాదు.