ఈ ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ‘మా’ ఎన్నికలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎన్నికలు మొదలు కావడానికి ముందు మొదలైన వివాదాలు….ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్షుడిగా గెలుపొందిన మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు….ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారని, దూషించారని ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఎన్నికల అధికారిని పోలింగ్ నాటి సీసీటీవీ ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ కోరడం…ఆ ఫుటేజ్ ఇవ్వడానికి ఆయన నిరాకరించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సీసీటీవీ ఫుటేజ్ ఉన్న గదికి తాళం వేయడం సంచలనం రేపింది. ఇక, గెలుపొందిన తర్వాత విష్ణు ప్రమాణ స్వీకారం సందర్భంగా మంచు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మోహన్ బాబుపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.
విష్ణు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమోషనల్ గా మాట్లాడిన మోహన్ బాబు…ఫ్లోలో చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆయనను ఇరకాటంలో పడేశాయి. ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి..ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ , ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్…గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది..అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని” అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై గొర్రెలు, మేకల పెంపకం దారులు మండిపడుతున్నారు.
మోహన్ బాబు తమ కులవృత్తిని అవమానించారని గొర్రెలు పెంపకందారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోహన్ బాబు పై కేసు గొర్రెల పెంపకందారులు కేసు పెట్టారు. గొర్రెలు కాసుకునే వాళ్ళు చూస్తుంటే సినీతారల గౌరవం పోతుందన్న అర్థం వచ్చేలా గొర్లకాపరులను కించపరిచేలా మోహన్ బాబు వ్యాఖ్యానించడంపై వారు మండిపడుతున్నారు.
గొర్రెలకాపరులను కించపర్చేలా మాట్లాడిన మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకొని గొర్రెలకాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతూ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. మరి, ఈ కేసుపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.