ఏపీ టీడీపీకి కొంతకాలంగా వరుస షాక్ లు తగులుతున్న సంగతి తెలిసిందే. పార్టీలోని కొందరు కీలక నేతలకు వైసీపీ గాలం వేస్తుండడం…భయపెట్టి మరికొందరిని వైసీపీ లోకి ఆహ్వానించడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ పార్టీకి రాజీనామా చేయడంతో టీడీపీకి షాక్ తగిలినట్లయింది. కుతూహలమ్మతోపాటు ఆమె కుమారుడు, టీడీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ బాధ్యుడు హరికృష్ణ కూడా పార్టీకి, నియోజకవర్గ బాధ్యుడి పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది.
అయితే, వైసీపీలో చేరేందుకు కుతూహలమ్మ రాజీనామా చేశారని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పుకార్లను కుతూహలమ్మ ఖండించారు. తనకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని కుతూహలమ్మ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ తనను, తన కుటుంబాన్ని ఎంతగానో గౌరవించిందని, కేవలం అనారోగ్యం కారణాలతోనే రాజీనామా చేశానని కుతూహలమ్మ వెల్లడించారు. ప్రజల్లో తిరిగేందుకు ఆరోగ్యం సహకరించడం లేదని, పార్టీకి న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదనతోనే రాజీనామా చేశానని క్లారిటీ ఇచ్చారు.
స్వతహాగా వైద్యురాలైన కుతూహలమ్మకు చిత్తూరు జిల్లాలో మంచి పేరుంది. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కుతూహలమ్మ…చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా తొలి పదవిని చేపట్టారు. 1985లో తొలిసారి వేపంజేరి (జీడీ నెల్లూరు) నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కుతూహలమ్మ…1989, 1999, 2004లోను అదే స్థానం నుంచి విజయం సాధించారు.
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కుతూహలమ్మ , 2007లో ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్‌గానూ సేవలందించారు. 1994లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009లో తిరిగి కాంగ్రెస్ తరపున జీడీ నెల్లూరు నుంచి పోటీ చేసి గెలుపొంది…రాష్ట్ర విభజనానంతరం 2014లో టీడీపీలో చేరారు.