నిద్ర పోని నగరంగా పేరున్న ముంబయి మహానగరం గడిచిన కొన్ని నెలలుగా బితుకుబితుకుమనే పరిస్థితి. కరోనా కారణంగా కళ తప్పిన ఈ మహానగరం.. ఎన్నో చేదు అనుభవాల్ని ఎదుర్కొంది. ఒక దశలో ఏమైపోతుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
ఎప్పుడూ లేని రీతిలో దిగాలు పడిన మహానగరాన్ని చూసినోళ్లు చాలామంది ఎప్పటికి తేరుకుంటామన్న షాక్ లోనే ఉండిపోయారు. దేశ వ్యాప్తంగా పలు మహానగరాల్లో కరోనా అదుపులోకి వచ్చినా.. ముంబయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా కేసుల నమోదు తగ్గటమే కాదు.. తొలిసారి మరణాలు ‘జీరో’ నమోదు కావటం ఇప్పుడు ఆనందాన్ని కలిగిస్తోంది.
ఆదివారం ముంబయిలో మొత్తం 367 కేసులు నమోదు కాగా.. సున్నా కేసులు మాత్రమే నమోదు అయినట్లుగా ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. కొవిడ్ వెలుగు చూసిన తర్వాత తొలిసారి ఈ మహానగరంలో మహమ్మారితో కూడిన మరణం లేని తొలి రోజు ఆదివారమేనని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న వేళ.. ముంబయిలోనూ ఈ వైరస్ అదుపులోకి రావటం పెద్ద రిలీఫ్ గా మారింది.
దేశంలో కొవిడ్ కారణంగా విలవిలలాడిన ప్రాంతాల్లో మహారాష్ట్ర ముందున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ వేళ.. రోజుకు పదకొండు వేల కేసులు.. వందల కొద్దీ మరణాలు చోటు చేసుకున్నాయి. ఆసుపత్రిలో బెడ్ కోసం పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. ఇప్పటివరకు ఈ మహానగరంలో మొత్తం 7.5లక్షల కేసులు నమోదు కాగా.. 16,180 మంది మరణించారు.
ముంబయిలో గడిచిన 24 గంటల్లో 28,600 శాంపిల్స్ ను పరీక్షిస్తే.. అందులో 367 కేసులు నమోదు కావటం చూస్తే.. పాజిటివిటీ రేటు 1.27కు చేరినట్లుగా చెప్పాలి. ఇప్పటికిప్పుడు మహానగరంలో యాక్టివ్ కేసులు 5030 మాత్రమే ఉన్నట్లు తేలింది. మరణాలు జీరో కావటం పెద్ద రిలీఫ్ గా చెప్పాలి.
ప్రస్తుతం ముంబయిలో కంటైన్ మెంట్ జోన్లు లేవని ముంబయి మున్సిపల్ అధికారులు వెల్లడిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా వరుస పెట్టి పడుతున్న కరోనా నుంచి కాస్తంత రిలీఫ్ దొరికినట్లుగా చెప్పక తప్పదు.