రాజకీయాలకు టాటా చెప్పేశాక మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా వివాద రహితుడిగా ఉండాలని చూస్తున్నారు. ఎవరితోనూ గొడవలు వద్దని… అందరితోనూ మంచిగా ఉండాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సినిమాల పరంగా.. అలాగే రాజకీయ పరంగా ఆయన అందరికీ స్నేహ హస్తం చాటడానికే ప్రయత్నిస్తున్నారు.
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓవైపు వైకాపా సర్కారు మీద పోరాడుతుంటే.. జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తుంటే.. చిరు మాత్రం జగన్ మీద వీలు చిక్కినపుడల్లా ప్రశంసలు కురిపించడం తెలిసిందే. ఇక సినీ పరిశ్రమలోనూ అందరితోనూ చిరు ‘మంచి’ అనిపించుకోవడానికే చూస్తున్నారు.
ఒకప్పుడు మోహన్ బాబుతో విభేదాలు ఉన్నప్పటికీ.. మధ్యలో వాటన్నింటికీ తెరదించి సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఆయన కష్టపడి బిల్డ్ చేసుకున్న ఫ్రెండ్షిప్ ‘మా’ ఎన్నికల పుణ్యమా అని బాగా దెబ్బ తినేసే పరిస్థితి వచ్చింది.
తన మద్దతుతో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నాడని.. విష్ణు పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చూడాలని చిరు మోహన్ బాబును అడిగినా ఆయన ఒప్పుకోలేదు. పైగా చిరు చేసింది తప్పు అన్నట్లు మాట్లాడారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో జరిగిన రభస కారణంగా చిరుకు మోహన్ బాబుకు మధ్య దూరం పెరిగింది.
దీనికి తోడు చిరు మద్దతుతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో చిరంజీవి ప్రతిష్ట కొంత మేర దెబ్బ తింది. అయినా సరే.. చిరు అయితే అంతటితో ఈ గొడవకు తెరపడాలనే కోరుకుని ఉంటారు. ఆయనకు బేసిగ్గా గొడవలంటే పడదన్నది స్పష్టం. ‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సమయంలోనే జరిగిన ‘పెళ్ళి సందడి’ వేడుకలోనూ అదే చెప్పారు.
కానీ ఫలితాల అనంతరం ప్రకాష్ రాజ్, నాగబాబులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడం.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టి అందరూ రాజీనామాలు చేయడం.. మోహన్ బాబు, విష్ణుల మీద విమర్శలు, ఆరోపణలు చేయడంతో చిరు ఇరుకునపడిపోయారు.
ఇదంతా చిరుకు తెలియకుండా జరిగి ఉంటుందా.. ఆయనే ఇదంతా చేయిస్తున్నారా అని మోహన్ బాబులో అనుమానం కలక్క మానదు. ఇందులో చిరు పాత్ర ఎంతుందన్నది పక్కన పెడితే.. మహా మొహమాటస్తుడైన ఈ పరిణామాలతో చాలా ఇబ్బందుల్లో పడిపోయారనే చెప్పాలి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ చేసిందాని పట్ల ఆయన మౌనంగా ఉండలేరు. అలాగని ఖండించలేరు.
అసలు రేప్పొద్దున మంచు విష్ణు వచ్చి చిరును కలిస్తే.. ఆయనెలా స్పందిస్తాడు.. ‘మా’ అధ్యక్షుడిగా అతడి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లకుండా ఉండగలరా.. వెళ్తే ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరం. ప్రతి చోటా ఆయన ఒకరకమైన ఇబ్బంది ఎదుర్కొంటారన్నది మాత్రం స్పష్టం.