ఫార్మా దిగ్గజ కంపెనీ హెటిరో ఫార్మా కు సంబంధించిన సంచలన విషయం బయటకు వచ్చింది. ఆ సంస్థలో సోదా చేసిన ఐటీ శాఖ షాకింగ్ నిజాల్ని వెల్లడించింది.
హైదరాబాద్ కు చెందిన ఈ ఫార్మా దిగ్గజం గడిచిన కొన్నాళ్లుగా తిరుగులేని రీతిలో దూసుకెళుతోంది. .ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే ఐటీ అధికారులు ఈ ఫార్మా కంపెనీలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు దాదాపు రూ.550 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లుగా ఐటీ శాఖ చెబుతోంది.
దీనికి సంబంధించిన ఒక ప్రకటనను ఐటీ శాఖ విడుదల చేయటం గమనార్హం. నాలుగు రోజులుగా ఈ సంస్థలో తాము సోదాలు నిర్వహిస్తున్నామని.. ఆరు రాష్ట్రాల్లోని 50 కార్యాలయాల్లో తాము తనిఖీలు నిర్వహించినట్లుగా పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సోదాల సందర్భంగా కొన్ని రహస్య స్థావరాల్ని.. 16 లాకర్లను తాము గుర్తించినట్లుగా వెల్లడించారు.
ఇందులోనే అసలు ఖాతా పుస్తకాలతోపాటు.. లెక్క చూపని నగదు వివరాలు ఉన్నట్లుగా తెలిపారు. పెన్ డ్రైవ్ లు.. దస్తావేజుల రూపంలో నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాలు లభించినట్లుగా ఐటీ శాఖ పేర్కొంది. క్యాష్ పెట్టి భూముల కొనుగోళ్లు..రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువ మొత్తానికి కొనుగోలు చేయటం.. ఉద్యోగుల వ్యక్తిగత ఖర్చులను సైతం కంపెనీ పుస్తకాల్లో నమోదు చేసిన వైనాన్ని తాము గుర్తించినట్లుగా పేర్కొన్నారు. తాజాగా జరిపిన సోదాలు.. హెటెరో కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.