అక్టోబర్ 3 ఆదివారం: బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో 5K రన్ నిర్వహించటం జరిగింది. వందలాది మంది భారతీయులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉదయం 8 గంటల నుండే చిన్నారుల రన్ తో మొదలైన ఈ సందడి కనుల పండుగగా మధ్యాహ్నం వరకూ కొనసాగింది.
కరోనా దశ తర్వాత జరిగిన అతిపెద్ద కార్యక్రమంగా నిలిచింది. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న అవగాహన కల్పిస్తూ,
వందలాది మందిని ఒక చోట చేరి, ఎంతో ఉత్సాహంతో కలిసి నడుస్తూ అందరికి ఒక నూతనోత్తేజాన్ని కల్పించింది.
పొద్దున్నే చిన్నారులకు పెద్దలకు అల్పాహారం, కాఫీ అందించి.. మార్గమధ్యంలో వాటర్ అందిస్తూ, పలు జాగ్రత్తలతో వాలంటీర్ల సహకారంతో కార్యవర్గం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించటం తెలుగు వారందరు హర్షాన్ని వ్యక్తం చేస్తూ, అభినందించినట్లు అధ్యక్షురాలు సాయి సుధా పాలడుగు తెలిపారు.
చాలా కాలం తర్వాత ఆరుబయట పార్క్ లో నిర్వహించిన 5K రన్ లో, తానా, ఆటా, టీడీఎఫ్ మరియు పలు ఇతర తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా సంయుక్తంగా పాల్గొని, ఎంతో ఉత్సాహంగా సమిష్టి సహకారంతో ఈ వేడుక నిర్వహించటాన్ని కొనియాడారు. తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, టీడీఎఫ్ అధ్యక్షురాలు కవిత చల్లా, ఆటా కార్యదర్శి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొని తెలుగు వారందరం ఒకటే అని.. అను నిత్యం పలు కార్యక్రమాలతో దూసుకు పోతున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు సాయి సుధాను, కార్య వర్గ సభ్యులను అభినందించారు. రన్ తర్వాత జరిగిన జూమ్బా నృత్యమ్ చిన్నారులను, మహిళలను విశేషంగా ఆకట్టుకుంది.
వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కాలు కదిపి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముగించారు.
చివరిగా ..చిన్నారులకు, పాల్గొన్న వారందరికీ మెడల్స్ బహూకరించి.. ఎల్లప్పుడూ సంస్థకు సహకరిస్తున్న సతీష్ వేమన కు, దాతలకు, పలువురు పెద్దలకు, వాలంటీర్స్ కు అధ్యక్షురాలు సాయి సుధా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. పలు రంగాలలో ఎల్లప్పుడూ తెలుగు వారి అభ్యున్నతి, బాషా, సంస్కృతీ ప్రతిబింబించే కార్యక్రమాలు ఇక ముందూ విస్తృతంగా నిర్వహిస్తామని ఆమె తెలియజేసారు.