రాష్ట్ర వ్యాప్తంగా మండలపరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ విజృంభించిన విషయం తెలిసిందే. అన్నింటినీ .. అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. అయితే.. కీలకమైన పశ్చిమ గోదావరిజిల్లాలో అందునా.. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలోని ఆచంట మండలంలోనే వైసీపీకి ఎదురు దెబ్బతగిలింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల లెక్కింపు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. ఎంపీపీ, జడ్పీటీసీ రెండింటా ఆ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. జడ్పీ పీఠాన్ని ఆ పార్టీ కైవశం చేసుకోనుంది.
అయితే.. మొత్తం 777 ఎంపీటీసీ స్థానాలకు 608, 45 జడ్పీటీసీలకు 42 స్థానాలతో విజయ దుందుబి మోగించినా.. మంత్రి రంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంటలో మాత్రం పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది. ఆచంట మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసిన ఫలితంగా వైసీపీ ప్రభావం తగ్గిపోయింది. ఈ మండలంలో వైసీపీ 6 చోట్ల, టీడీపీ 7, జనసేన 4 చోట్ల విజయం సాధించాయి. నియోజకవర్గ పరిధిలోని మిగిలిన మూడు మండలాల్లో మాత్రం అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పోడూరు, పెనుమంట్ర జడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ అభ్యర్థులే దక్కించుకున్నారు.
అయితే.. ఇప్పుడు మంత్రి రంగనాథరాజుకు అగ్నిపరీక్ష ఎదురైందని అంటున్నారు పరిశీలకులు. మొత్తం 17 ఎంపీటీసీల్లో మెజారిటీ సాధించి.. ఎంపీపీ పదవిని దక్కించుకోవాలంటే.. 9 మంది ఎంపీటీసీల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీకి ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గట్టెక్కి.. ఆచంట ఎంపీపీని దక్కించుకోవాలంటే.. మంత్రికి ప్రయాసగా మారింది. మరోవైపు టీడీపీ-జనసేనలు సంయుక్తంగా ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ స్థానాల్లో విజయం సాధించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే.. మంత్రి వ్యూహం మంత్రి వేసుకుంటున్నారు. సామదాన భేద దండోపాయాలను వినియోగించి.. జనసేన నుంచి నలుగురినీ తనవైపు తిప్పుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
అయితే.. మంత్రి దూకుడును గుర్తించినజనసేన, టీడీపీలు క్యాంపు రాజకీయాలను షురూ చేశాయి. తమ ఎంపీటీసీలను రహస్య ప్రాంతానికి తరలించాయి. ఇదిలావుంటే.. కొన్నాళ్ల కిందట జరిగిన.. మునిసిపల్ ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తే.. ఒక్క అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం ఒకింత వెనుకబడింది. అక్కడ కూడా ఇలాంటి పరిస్తితే రావడంతో.. స్వయంగా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని.. జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసి తాను తప్పుకొంది.
మరి ఇప్పుడు ఆచంటలో ఎలా వ్యవహరిస్తుంది? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఇప్పటికిప్పుడు మాత్రం భారం మాత్రం మంత్రిపైనే పెట్టారని.. ప్రచారం సాగుతుండడం గమనార్హం. దీంతో రంగనాథరాజుకు ఆచంట మండలం.. చుక్కలు చూపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక మంత్రి పనితీరుపై అసంతృప్తిగా ఉన్న జగన్ ఆయన్ను ప్రక్షాళనలో పక్కన పెట్టేస్తారని కూడా అంటున్నారు.