పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నపుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ పార్టీలోనూ ఎలాంటి సమస్యలు రావు. కానీ ఒక్కసారి పార్టీ నాయకుల్లో అసమ్మతి చెలరేగి రెండు వర్గాలుగా పార్టీ విడిపోయి అది ఏకంగా ముఖ్యమంత్రి మార్పుకు కారణమైతే మాత్రం అక్కడ పార్టీ పరిస్థితి రోజురోజుకూ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించలేం. సొంత పార్టీ నాయకులపైనే అసంతృప్తి నేతలు బహరంగంగానే ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలు చేయడం సవాళ్లు విసరడం లాంటివి కనిపిస్తాయి. ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్‌లోనూ అలాంటి పరిస్థితే తలెత్తిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశం మొత్తం ప్రధాని మోడీ హవా ఉన్నప్పటికీ పంజాబ్‌లో జరిగిన 2017 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎంతో కృషి చేశారు. రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని కొనసాగించారు. కానీ మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూతో విభేధాలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. అమరీందర్‌కు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సిద్ధూకు కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో సిద్ధూ వర్గంలోని అసంతృప్త ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గిన అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడక్కడ సిద్ధూ వర్గానికి చెందిన నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.
రాజకీయ కురవృద్ధుడుగా పేరున్న అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేశాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి నెలకొంది. ఆయన ముఖ్యమంత్రి గద్దె దిగారు కానీ కాంగ్రెస్ పార్టీని వీడే విషయంలో మాత్రం ఎలాంటి కామెంట్లు చేయలేదు. దీంతో ఆయన ఆ పార్టీలోనే కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కానీ ప్రత్యర్థి వర్గం కుట్రల వల్ల అవమానానికి గురై సీఎం పదవి వదులుకున్న ఆయన.. సొంత పార్టీ నాయకులపై ఇప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించే సిద్ధూను ఎట్టి పరిస్థితుల్లోనూ పంజాబ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటానని గతంలో ప్రకటించిన ఆయన.. తాజాగా అందుకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కుండ బద్ధలు కొట్టారు. తన రాజీనామాకు కారణమైన సిద్ధూపై అమరీందర్ ఎంత కోపంతో ఉన్నారో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
సిద్ధూ దేశానికి ప్రమాదకారి అని అమరీందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో సిద్ధూ ఓటమికి కృషి చేస్తానని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో సిద్ధూపై బలమైన అభ్యర్థిని నిలబెడతానని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోరాడతానని అమరీందర్ పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకలను అనుభవం లేని నాయకులుగా అమరీందర్ పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అమరీందర్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. లేకపోతే ఒకే పార్టీలో ఉండే అమరీందర్.. సిద్ధూపై బలమైన అభ్యర్థిని నిలబెడతానని ప్రకటించడం ఏమిటనే? చర్చ జోరందుకుంది. అమరీందర్ పార్టీ వీడబోతున్నారని.. అందుకే కాంగ్రెస్ నాయకులపై ఈ వ్యాఖ్యలు చేశారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.