ఓదార్పు యాత్రలకు, ముద్దులు పెట్టి మురిపించడాలకు పెట్టింది పేరైన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను ఓదార్పు యాత్రలోనే సరిపెడుతోందా? ప్రజలకు ఇవ్వాల్సిన భరోసా,.. కల్పించాల్సిన రక్షణ అంశాల్లో పూర్తిగా పార్టీ .. ప్రభుత్వం .. కూడా విఫలమయ్యాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్టేట్లో మహిళలకు రక్షణగా ఉంటామని.. నీ పాదం మీద పుట్టుమచ్చనై.. చెల్లెమ్మా! అన్న తరహాలో వారికి అండగా ఉంటామని.. సీఎంగా జగన్ చెప్పిన మాటలు.. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కూడా రివర్స్ అందుకున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఇటీవల కాలంలో స్టేట్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని మహిళలు.. తమ పాప.. చదువుకోడానికి వెళ్లి.. ఇంటికి ఏ పరిస్థితిలో తిరిగి వస్తుందో.. మధ్యలో ఎవరైనా ఏమైనా చేస్తారో.. ఎవడైనా కత్తి పట్టుకుని వెంటపడతాడేమో.. అనే బెంగతో తల్లలు తల్లడిల్లిపోతున్నారు.
జగన్ సర్కారు ఏర్పాటైన 16 మాసాల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. మరీ ముఖ్యంగా యువతులపై జరుగుతున్న అకృత్యాలకు అంతు దరి లేకుండా పోయిందని జాతీయ నేరగణాంకాల నివేదిక ఇటీవల నిర్మొహమాటంగా వెల్లడించింది.
తూచ్.. ఇదంతా.. చంద్రబాబు ఆడిస్తున్న నాటకం.. ఆయన కనుసన్నల్లోనే జాతీయ నేరగణాంకాల బ్యూరో నివేదిక తయారైందని ఎదురు దాడి చేసేవారేమో.. కానీ.. అది రాజకీయ సంస్థ కాదు.. ఏ ప్రభుత్వం కనుసన్నల్లోనూ పనిచేయడం లేదు. దీంతో సదరు సంస్థ చెప్పేది వాస్తవమేనని నమ్మి తీరాల్సిన పరిస్థితి వైసీపీ నేతలకు కూడా ఏర్పడింది.
ఇక, స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కూడా నేరాలు ఎక్కడా అదుపులో లేవనే సత్యాన్ని సైతం కళ్లకు కడుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో కేవలం రోజుల వ్యవధిలో ఇద్దరు యువతులు ప్రేమ పేరిట బలయ్యారు. అదేసమయంలో ఎస్సీ మహిళలపై లైంగిక వేధింపులు ఇటీవల ప్రకాశంలో వెలుగు చూశాయి.
నెల్లూరులో మాస్కు పెట్టుకోమన్న నేరానికి పై అధికారి.. తన కింది స్థాయి ఉద్యోగినిని జుట్టుపట్టుకుని ఈడ్చి ఈడ్చి కొట్టారు. ఇక, రైతులు ఉద్యమిస్తున్న అమరావతిలో మహిళా రైతులకు పోలీసుల నుంచే అనేక పరాభవాలు ఎదురవుతున్నాయి. ఏకవచనం మాట అటుంచితే.. ఒసేయ్.. ఏవే!
వంటి మాటల ప్రేలాపన లు ఎక్కువై పోయాయని.. పైకి చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతున్నారు.
మరి.. ఇన్ని జరుగుతుంటే జగనన్న
సర్కారు ఏం చేస్తున్నట్టు? పేరు గొప్పగా ప్రకటించిన దిశ చట్టం ఏమైంది? దిశ పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? అంటే.. నీళ్లు నమలడం తప్ప.. సర్కారు నుంచి ఎలాంటి సమాధానం కనిపించడం లేదు.
ఇక, ఇటీవల కాలంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. వరుస ఘటనలతో ప్రభుత్వంపై మహిళా లోకం కన్నెర్ర చేస్తున్న క్రమంలో ఎట్టకేలకు గడప దాటి కాలు బయట పెట్టిన హోం మంత్రి మేకతోటి సుచరిత.. ఓదార్పు యాత్రలు ప్రారంభించారు.
విజయవాడ, విశాఖల్లో యువతులు బలి అయిపోయిన ఘటనలపై భీకర వ్యాఖ్యలు చేశారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ఓదార్చారు. కానీ, ఈ ఓదార్పులు మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దాడులు, ఆఖరుకు హత్యలను నిలువరిస్తాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
గట్టి కార్యాచరణ లేకుండా.. ప్రభుత్వం తరఫున వ్యూహాలు అమలు చేయకుండా.. ఈ ఓదార్పు యాత్రలతో తమను ఎంతకాలం మభ్య పెడతారనే చెల్లెమ్మల నిలదీతలు.. జగనన్నకు విపడడం లేదా? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. మరి ఓదార్పులతోనే సరిపెడతారా? కార్యాచరణకు దిగుతారా? చూడాలి.