ఏపీ సర్కారు ఎన్నికల కమిషన్ కు సహకరించలేదన్న విషయంపై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తీరుపై కోర్టు మండిపడింది. స్వతంత్ర వ్యవస్థ, రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ కు సహకరించకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. వెంటనే ప్రభుత్వం ఇందులో మేల్కోవాలని హెచ్చరించింది.
రాజ్యాంగ సంస్థలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్యం కూలిపోతుందని, అది అందరికీ ప్రమాదం అని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం సహాయం అందిస్తే ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేది కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని హైకోర్టు నిలదీసింది. దీనికి అతిత్వరలో ముగింపు పలకడానికి హైకోర్టు సిద్ధమైంది.
ప్రభుత్వం నుంచి ఏం కావాలనేది ఎస్ఈసీ మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని ఆదేశించింది. అదేసమయంలో ఎస్ఈసీ చట్టబద్ధంగా కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అప్పుడు ఏం చేయాలనేది రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.