ప్రస్తుతం డిజిటల్ యుగం రాజ్యమేలుతోంది. ఎక్కడ ఏం జరిగినా.. సెకన్ల వ్యవధిలో ప్రజలకు చేరిపోవడమే కాదు.. అంతే వేగంగా ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అదే వేగంతో ఏపీ సర్కారుపై సటైర్లు పేలుస్తున్నారు ప్రజలు. `ఇదేంది జగనన్నా..`అని కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
మరికొందరు “పాయే పరువు మొత్తం పాయే.. జగనన్నా.. సీమ సత్తా ఇదేనా?“ అని సైటర్లు కురిపించేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు మీడియాకు సైతం చిక్కకుండా వ్యవహరిస్తున్నారు. మీడియా మిత్రులతో నిత్యం టచ్లో ఉండే.. మంత్రులు కూడా ఫోన్లు ఎత్తడం లేదు. మరి ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు సటైర్లు వేయించుకునే పరిస్థితి వచ్చింది? అనే అంశాలు ఆసక్తిగా మారాయి.
ఒకే రోజు.. జరిగిన రెండు పరిణామాలు.. ఏపీ సర్కారు పరువును నడివీధిలో పెట్టాయి. ఒకటి పొరుగు స్టేట్ తెలంగాణ నుంచి ఎదురైతే.. రెండోది కేంద్ర సర్కారు నుంచి ఎదురైంది. అంశం ఏంటంటే.. తెలంగాణ-ఏపీల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల అంశంలో తలెత్తిన విభేదాలతో గడిచిన ఆరేడు మాసాలుగా(లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి) బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ముఖ్యంగా కీలకమైన హైదరాబాద్కు ఏపీ నుంచి బస్సులను అక్కడి సర్కారు అనుమతించలేదు. అయితే, ఎట్టకేలకు అనుమతించినా.. ఏపీ పరువును తెలంగాణ తీసేసిందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించే అంశంలో తెలంగాణ పంతం నెగ్గించుకుంది.
బస్సులూ.. రూట్లూ.. కిలోమీటర్లలో పైచేయి సాధించింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రధానమైన విజయవాడ- హైదరాబాద్, కర్నూలు- హైదరాబాద్ రూట్లలో వారి బస్సులే అధికంగా తిరగనున్నాయి. ఇక శ్రీశైలం-హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కటీ కనపడదు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపేందుకు జరిగిన ఒప్పందం వెల్లడించిన నగ్న సత్యం ఇది.
రెండు రోజుల కిందట నవంబరు 1న సీఎం జగన్.. స్టేట్ అవతరణ దినోత్సవంలో.. పరువు.. మర్యాద.. మనం దగాపడుతున్నాం.. అని చెప్పిన కబుర్లు .. ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించుకోవడంలో ఏమైందనేది నెటిజన్ల టాక్.
ఇక, రెండో అంశం. అది కూడా ఆర్టీసీ అంశంలో ఎదురైన పరాభవం రోజే జరగడం గమనార్హం. అది కూడా అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుపైనే కావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,234.28 కోట్లను రీయింబర్స్ చేసేందుకు కేంద్రం సమ్మతించింది. అయితే.. ఇక్కడే ఘోరంగా ఏపీని అవమానించేసింది. 2013-14నాటి అంచనా వ్యయం రూ.20,398 కోట్లకు అంగీకరించాల్సిందేనన్న షరతు విధించింది. అప్పుడే భవిష్యత్లో రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తామని తేల్చిచెప్పింది.
అంతేకాదు.. ప్రాజెక్టు కోసం వ్యయం చేసిన రూ.2,234 కోట్లను “ఇప్పటికి ఇస్తున్నాం..“ అంటూ ఇవ్వడం.. జాలి పడి ఇచ్చినట్టుగా ఉందే తప్ప.. ఏపీ హక్కుగా ఇచ్చినట్టు లేదని.. ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీయాల్సిన జగన్ సర్కారు.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలిపిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. తెలంగాణ నుంచి అవమానం ఎదురైంది.. అయితే.. అక్కడి సీఎం కేసీఆర్.. జగన్కు మిత్రుడు. కేంద్రం నుంచి అవమానం ఎదురైంది.. అక్కడి ప్రభుత్వంతో జగన్ అంటకాగుతున్నారు. మరి ఇదీ జగనన్న ఏలుబడిలో ఏపీ వారి పరిస్థితి! అంటున్నారు పరిశీలకులు.