అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించటం లాంటివి తరచూ చూస్తుంటాం. అందుకు భిన్నంగా అదికార పక్ష నేతలు ప్రతిపక్ష నేత ఇంటిని ముట్టడించే వినూత్న కార్యక్రమానికి తెర తీయటం ఒక ఎత్తు అయితే.. అందులో భాగంగా క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్న మాట వినిపిస్తోంది.
సాధారణంగా ముట్టడి ప్రకటన చేసిన తర్వాత.. దాన్ని అడ్డుకునేందుకు వీలుగా పోలీసులు తగిన ఏర్పాట్లు చేయటం.. అనవసర రచ్చకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం మామూలే. అందుకు భిన్నంగా చేష్టలుడిగిపోయినట్లుగా.. నిరసన కాస్తా దండయాత్రగా మారినప్పటికీ.. అరగంట పాటు అటువైపు చూసేందుకు సైతం ఇష్టపడని తీరు చూస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే.
ఏపీ విపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ ప్రకటించి.. స్వయంగా నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఇంతకీ బాబు ఇంటిని ముట్టడించాల్సిన అవసరం ఏమిటంటే.. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎంను దూషించారని.. దీనికి కారణం చంద్రబాబేనని.. అందుకు ఆయన క్షమాపణ చెప్పాలనే డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చి.. నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రజాస్వామ్యంలో ఎవరు.. మరెవరిపైనైనా నిరసన కార్యక్రమాన్ని చేపట్టొచ్చు. కానీ.. ఆ పేరుతో దండయాత్రల్ని చేపట్టటం ఏ మాత్రం ఆరోగ్యకర పరిణామం కాదు. ముట్టడి లాంటి వాటికి పిలుపునిస్తే.. దాన్ని అడ్డుకోవటానికి పోలీసులు ప్రయత్నిస్తారు. అందరూ అదే భావించారు కానీ అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జోగి రమేశ్ ప్రకటించిన ముట్టడి కార్యక్రమం చంద్రబాబు నివాసం వరకు రాదనుకున్న టీడీపీ శ్రేణుల అంచనాకు భిన్నంగా జోగి రమేశ్.. ఆయన అనుచరులు ఏకంగా పదిహేను వాహనాల్లో బయలుదేరటం.. నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
ఇంటిదారిలో మొదటి గేటు వద్దకు చేరుకున్న జోగి రమేశ్ వాహనాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధి వెంకన్న ఆపారు. ఇలా రావటం మంచిది కాదని ఆయన పేర్కొన్నా.. జోగి ఆయన అనుచరులు వెంకన్నను నెట్టేసి ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు.
జోగి రమేశ్ అండ్ కో ముట్టడి కార్యక్రమాన్నిచేపట్టిన నేపథ్యంలో.. అంచనాలకు భిన్నంగా ఏమైనా చోటు చేసుకుంటుందన్న ఉద్దేశంతో పలువురు టీడీపీ నేతలు (గద్దె రామ్మోహన్ రావు.. ఏలూరి సాంబశివరావు.. గొట్టిముక్కల రఘురామ రాజు.. కొమ్మారెడ్డి పట్టాభిరామ్..మహమ్మద్ రఫీ..నాగుల్ మీరా తదితరులు) బాబు నివాసానికి చేరుకున్నారు.
వైసీపీ నేత జోగి రమేశ్ ను ఆయన అనుచరుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ.. అక్కడున్న బారికేడ్ కు సంబంధించిన అడ్డుగోడను కూలగొట్టి.. కిందకు జారిన బారికేడ్ నుంచి దూకి బాబు నివాసం వైపు వెళ్లారు.
పరిస్థితి చేయి దాటిపోతుందా?అన్నట్లు పరిస్థితి మారింది. పోలీసులు అప్పటికి అక్కడకు చేరుకోలేదు.
దీంతో వైసీపీ నేతల్ని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు..కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వైసీపీ వాళ్లు తమతో తెచ్చుకున్న వైసీపీ జెండా కర్రలతో దాడికి దిగగా.. అందుకు ప్రతిగా టీడీపీ కార్యకర్తలు వాటర్ బాటిళ్లు.. చెప్పుల్ని విసిరారు. దీంతో జోగి అనుచరులు రోడ్డు మీద ఉన్న రాళ్లను తీసుకొని విసిరారు.
ఈ ఉదంతంలో పలువురు గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలతో పాటు.. మీడియా ప్రతినిధులకు దెబ్బలు తగిలాయి. పరిస్థితి అంతకంతకూ శ్రుతిమించటంతో టీడీపీ కార్యకర్తలు సైతం రాళ్లు విసిరారు. దీంతో.. వైసీపీ ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలాయి.
గొడవ మొదలైన అరగంట తర్వాత చంద్రబాబు నివాసానికి చేరుకున్న పోలీసు బలగాలు.. వచ్చీ రావటంతోనే టీడీపీ శ్రేణులపై లాఠీల్ని ఝుళిపించారు. చంద్రబాబు ఇంటి సమీపానికి తరిమారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలకు లాఠీ దెబ్బలు పడ్డాయి. బుద్దా వెంకన్న అయితే రోడ్డుపైన వెల్లికిలా పడిపోయారు. దీంతో ఆయన తలకు దెబ్బ తగిలిందేమోనని కంగారుపడ్డారు.
టీడీపీ నేతలు.. కార్యకర్తలపై పోలీసులు లాఠీలకు పని చెప్పిన వేళలోనే.. జోగి రమేశ్ మీడియాతో మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయన మాట్లాడటం పూర్తిచేసిన తర్వాత కానీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ను ఆయన అనుచరుల్ని వాహనాల్లో మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దాదాపు గంటన్నర పాటు సాగిన రచ్చ.. ఇంతకు ముందెప్పుడూ చూడనిదిగా చెబుతున్నారు. ఏమైనా.. శ్రుతి మించినట్లుగా ఉన్న జోగి అండ్ కో వారి ముట్టడి కార్యక్రమం తెలుగు రాజకీయాల్లో సరికొత్త కల్చర్ ను షురూ చేసినట్లుగా చెప్పక తప్పదు.
https://twitter.com/JaiTDP/status/1438842123344744448