ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోతున్నారనే విశ్లేషణలు పెరుగుతున్నాయి.
జిల్లా స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు ధైర్యంగా చేయమంటే కనిపించకుండా పోయే నాయకులు పార్టీలో గొడవలకు మాత్రం నేను సైతం అంటున్నారు.
కొందరు నాయకులు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మీడియా ముందే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఇందులో చంద్రబాబు తప్పు కూడా ఉందని చెప్పాలి. ఏ పార్టీలో అయినా నాయకులకు భయమైనా ఉండాలి, లేదా భక్తి అన్నా ఉండాలి. టీడీపీలో ఆ రెండు కనిపించడం లేదు. దానిని సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు.
బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం. ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకుంటే టీడీపీ బలం పెరుగుతుందే గాని తగ్గదు. పార్టీ మేలు కోరే విధంగా అధిష్టానాన్ని ప్రశ్నిస్తే తప్పులేదు గాని… స్వప్రయోజనం కోసం పార్టీని అల్లరి పాలు చేయడమే ప్రమాదం. పార్టీలో అంతర్గత కలహాలు వేరే పార్టీల కుట్ర ఏమో అన్న ఆలోచనలో కొందరున్నారు.
సీనియర్లను యువతను కో ఆర్డినేట్ చేసి వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడేలా చేయడంలో చంద్రబాబు అంత విజయవంతం కాలేదు. కొందరు టీడీపీ నాయకులు వైసీపీ వారితో కలిసిపోవడం టీడీపీ కార్యకర్తలు మనసు చివుక్కుమనేలా చేస్తోంది.
బుచ్చయ్య చౌదరి అలకలో పార్టీ పై ప్రేమ కనిపిస్తుంది. కానీ పల్లె రఘునాథ రెడ్డి చర్యల్లో వ్యాపారం, ధిక్కారం కనిపిస్తుంది. ఇలాంటి చర్యల వల్ల టీడీపీ శ్రేణులు పార్టీపై ప్రేమను కోల్పోతాయి. అది చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పార్టీలో చాలా విషయాలు రోడ్డున పడుతున్నాయి. గంటా నిర్లక్ష్యం, నారాయణ సైలెన్సు, జేసీ దిక్కారం, బుచ్చయ్య ఆవేదన ఇలా ఒకటీ రెండూ కాదు చాలానే ఉన్నాయి.
ఒక సమస్య తెగేదాకా లాగడం వల్లే చంద్రబాబుకు సమస్యలు పెరుగుతున్నాయి. సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే దానిని చంద్రబాబు పెద్దగా సీరియస్ గా తీసుకోరని చెబుతుంటారు. దానివల్లే ఇలాంటివి పార్టీలో పెరుగుతున్నాయని అనుకోవచ్చు.
పార్టీని అన్ని కోణాల్లో సెట్ చేసుకోవాలి. పార్టీలో అంతర్గత కలహాలు ఈ సమయంలో పార్టీకి మంచిది కాదు, ఏదైనా మీడియాకు ఎక్కక ముందే చూసుకోవాలి. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మీడియాకు ప్రతిపక్షాలకు చంద్రబాబు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వకూడదు.
ఇక ఇలాంటివి పార్టీలోనే కాదు బయట కూడా రాకుండా చూడాలి. జర్నలిస్టుల్లో చంద్రబాబుకు ఉన్నంత మంది శత్రువులు ఎవరూ లేరు. కానీ జర్నలిస్టులతో చంద్రబాబు ఒక మంచి విందు తో కూడిన మీటింగ్ ఏర్పాటుచేయొచ్చు కదా. ఆ పని చేయరు. తన పాత శత్రువులను మచ్చిక చేసుకోవడంలోను చంద్రబాబు పెద్దగా శ్రద్ధ చూపరు. 4 దశాబ్దాల రాజకీయ జీవితం చంద్రబాబుకు దక్కిందంటే ఎంతో మంది జర్నలిస్టులు తనతో పనిచేసి ఉంటారు. ప్రస్తుతం వారిలో చాలామంది పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారందరిని ప్రత్యేకంగా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల నాటికి అది సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.