గంగవరం పోర్టులో తనకున్న 10.4 శాతం వాటాను అదానీ గ్రూప్ నకు ఏపీ ప్రభుత్వ విక్రయించడంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రూ.9 వేల కోట్ల విలువైన ప్రభుత్వ వాటాను కేవలం రూ.645 కోట్లకే అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్ త్వరలోనే సొంతం చేసుకోనుందన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూ చెబుతోన్న జగన్….ప్రైవేటీకరణకు సహకరించేందుకే తమ వాటాను అదానీ గ్రూప్ నకు కట్టబెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో, గంగవరం పోర్టు వాటాల కొనుగోలు వ్యవహారంలో జగన్ సర్కార్ పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, ప్రొప్రైటీ ఆడిట్ నిర్వహించేలా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్ ను విచారణకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
గంగవరం పోర్ట్ లిమిటెడ్ లో ఆ సంస్థ ప్రమోటర్ అయిన డీవీఎస్ రాజు నుంచి 58.1 శాతం వాటాను కొంతకాలం క్రితం అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అంతకుముందే, ఆ కంపెనీలో 31.5 శాతం వాటాను వార్బర్గ్ పింకస్కు చెందిన విండీ లేక్సైడ్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థ నుంచి అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వానికి చెందిన 10.4 శాతం వాటా కూడా దక్కడంతో ..గంగవరం పోర్ట్లో 100 శాతం వాటా అదానీ చేతికి వచ్చినట్లు కానుంది. దీంతో, గంగవరం పోర్టును అదానీ శాసించనున్నారు. ఈ క్రమంలోనే వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీఎం జగన్ తో గౌతం అదానీ సోదరులు భేటీ అయ్యారన్న ప్రచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్ ను అదానీ సోదరులు కలిశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును దక్కించుకున్న అదానీ సోదరులు…తాజాగా గంగవరం పోర్టును కూడా దక్కించుకోబోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తో వారి భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.