అమరావతి భూముల విషయంలో టీడీపీపై వైసీపీ విషం చిమ్ముతోన్న సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ నేతలపై పగ సాధించేందుకు రాజధానిపై జగన్ కక్షగట్టారని అందుకే, మూడు రాజధానులంటూ అమరావతికి అన్యాయం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, అమరావతిలో జగన్ ఆరోపించినట్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు, సుప్రీం కోర్టు చెప్పడంతో వైసీపీ నేతలకు నోట మాట రావడం లేదు.
దీంతో, చివరకు ఏం చేయాలో పాలుపోక…అమరావతిలో అసైన్డ్ భూముల రైతులకు ఇచ్చిన ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కార్ జీవో-316 జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో జోవో-316పై తదనంతర చర్యలు న్యాయస్థానం నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రైతులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను తిరిగి తీసుకోవద్దంటూ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టులో జగన్ కు మరోసారి షాక్ తగిలింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 316పై హైకోర్టు తాజాగా స్టేటస్ కో ఇచ్చింది. నోటీసులు ఇవ్వకుండా రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని పిటిషనర్ కూడా అయిన లాయర్ ఇంద్రనీల్ వాదించారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం స్టేటస్ కో విధించింది. ఈ వ్యవహారంలో తదనంతర ప్రక్రియ చేపట్టవద్దంటూ ఏఎమ్ఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, ఏపీలోని స్కూల్స్, కాలేజీల ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 53,54పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఆ జీవోలకు చట్టబద్దత లేదని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. జీవో నంబర్ 53,54 కారణంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీంతో, రెగ్యులేటరీ కమీషన్ తరుపున న్యాయవాది కోర్టును 2 రోజులు గడువు కోరారు. ఈ క్రమంలో ఇదే చివరి అవకాశమని, ఎల్లుండి తుది విచారణ చేపడతామని ఈ జీవోలపై తుది విచారణను హైకోర్టు సెప్టెంబరు 15కు వాయిదా వేసింది. అదే రోజు జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై కూడా కీలక తీర్పు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.