నేచర్స్ కాల్….ట్రూ ట్రాన్స్ లేషన్ చేస్తే ప్రకృతి పిలుపు…వినడానికి ఈ పిలుపు కొంచెం పులుపుగా ఉందనిపిస్తే…పాష్ గా వాష్ రూంకు వెళ్లడం…ఎలా పిలిచినా సరే..ఆ పిలుపు వస్తే చాలు ఎంతటి వారైనా సరే వెళ్లి తీరాల్సిందే. సామాన్యుడికైనా, సెలబ్రిటీకైనా…ఆ పిలుపు వస్తే మాత్రం వాష్ రూం తలుపు తట్టాల్సిందే.
మామూలుగా ఇంట్లోనో, ఆఫీసులోనో ఆ పిలుపు వస్తే పర్లేదుగానీ… ప్రయాణాల్లో ఆ పిలుపు వచ్చినపుడు మాత్రం కొన్ని సార్లు ఇబ్బందులు తప్పవు. ఈ కోవలోనే తాజాగా రైల్లో ప్రయాణిస్తున్న ఓ ఎమ్మెల్యే గారిని ప్రకృతి పిలవడంతో ఉరుకులు పరుగుల మీద వాష్ రూంకు వెళ్లారు. ఇందులో పెద్ద మ్యాటరేముంది అనుకుంటున్నారా….అసలు మ్యాటరంతా ఇక్కడే ఉంది మరి. సదరు ఎమ్మెల్యేగారు ఆ పిలుపునకు స్పందించే క్రమంలో అండర్ వేర్ మీద రైల్లో ఉరుకులు పరుగులు పెడుతూ వాష్ రూంకు వెళ్లడమే అసలు మ్యాటర్.
పైగా, ఇదేమిటి ఇలా అండర్ వేర్ మీద అసహ్యంగా వెళుతున్నారని ప్రశ్నించిన ప్రయాణికుడితో సదరు ఎమ్మెల్యే గొడవకు దిగడం కొసమెరుపు.
బిహార్లో జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ రైల్లో ప్రయాణిస్తుండగా అనుకోని పిలుపు వచ్చింది. దీంతో, కూర్చున్న చోటే కుర్తా, పైజామా విప్పేసిన మండల్…ఉన్నపళంగా లఘుశంకను తీర్చుకోవడానికి వాష్ రూంకు పరుగు లంఘించారు. కనీసం, టవల్ కట్టుకుంటే టైం వేస్టవుతందని భావించి…అలాగే అండర్ వేర్ మీద వాష్ రూంకు ఉసేన్ బోల్ట్ రేంజ్ లో దౌడు తీశారు.
భుజాన టవల్ తో ఆ పరిస్థితిలో వెళుతున్న మండల్ ను చూసి ‘ఇదేమిటీ అసహ్యంగా..’ అంటూ ఓ ప్రయాణికుడు ప్రశ్నించాడు. అయితే, సమయం లేదు మిత్రమా…రణమా…శరణమా అన్న డైలాగ్ ను గుర్తు తెచ్చుకున్న మండల్..ఆ ప్రయాణికుడికి కనీసం జవాబివ్వకుండా టాయిలెట్ లోకి వెళ్లారు. ఇక, కాసేపటి తర్వాత కోటి రూపాయల అప్పు తీర్చిన ఫీలింగ్ తో తాపీ ధర్మారావులాగా తాపీగా బయటకు వచ్చిన మండల్ సమరసింహారెడ్డి రేంజ్ లో రివేంజ్ తీర్చుకున్నారు.
తనను ప్రశ్నించిన ప్రయాణికుడెవరంటూ మండల్ ఆరా తీశారు. చివరకు అతడిని వెతికి పట్టుకొని నన్నే అడ్డుకుంటావా? అంటూ గొడవకు దిగి విసురుగా నెట్టేశారు. అయితే, ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో చివరకు గొడవపడ్డ ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే గారి టాయిెలెట్..ఏక్ వింత కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది.