మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారన్న వార్తలు కొద్దిరోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సీనియర్లను పార్టీ హైకమాండ్ పట్టించుకోకపోగా, అవమానిస్తోందని బుచ్చయ్య అలకబూనారని ప్రచారం జరిగింది. ఆగస్టు 25న రాజీనామా చేస్తానని కూడా బుచ్చయ్య ప్రకటన చేశారని ప్రధాన మీడియాలో సైతం నర్మగర్భ కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే గోరంట్లతో టీడీపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపి చంద్రబాబుతో మాట్లాడాలని సూచించారు. గోరంట్లను బుజ్జగించే ప్రయత్నంలో గోరంట్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం తాను డైరెక్ట్ గా గోరంట్లను కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని చంద్రబాబు చెప్పడంతో గోరంట్ల మెత్తబడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా చంద్రబాబుతో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో గోరంట్ల భేటీ అయ్యారు.
చంద్రబాబుతో చర్చించేందుకు మంగళగిరి రావాల్సిందిగా గోరంట్లకు ఆహ్వానం అందడంతో ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు. తన అసంతృప్తికి గల కారణాలు, పార్టీలో తనపై చిన్నచూపు, తన మాటకు విలువివ్వకపోవడం వంటి పలు విషయాలను చంద్రబాబుతో గోరంట్ల చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి గోరంట్లతోపాటు పార్టీ సీనియర్ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ కూడా హాజరయ్యారు.
గోరంట్ల అసంతృప్తికి గల కారణాలను సావధానంగా విన్న చంద్రబాబు..గోరంట్లకు సముచిత గౌరవం ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పదవీ కాలం త్వరలో ముగియనుందని, తనకు ఆ పదవి ఇవ్వాలని గోరంట్ల కోరినట్లు తెలుస్తోంది. దీంతోపాటు, రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక తన చేతుల మీదుగా జరగాలని గోరంట్ల కోరారట. చంద్రబాబు కూడా గోరంట్ల చెప్పిన దానికి సానుకూలంగా స్పందించారని, ఈ భేటీ అనంతరం రాజీనామాపై గోరంట్ల వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.