అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు గతంలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుకెక్కడంతో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు, ఈ వ్యవహారంపై నియమించిన సిట్ దర్యాప్తుపై కూడా హైకోర్టు స్టే విధించింది. అయితే, హైకోర్టు తీర్పు మింగుడుపడని వైసీపీ సర్కార్…హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ సుప్రీం కూడా తీర్పు చెప్పడంతో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది.
ఈ క్రమంలోనే తాజాగా ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో జగన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై..ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టి వేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
దమ్మాలపాటితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలు నిరాధారమని న్యాయస్థానం పేర్కొంటూ ఆ కేసులను కొట్టేసింది. అంతేకాదు, దమ్మాలపాటిపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురి చేసినందుకుగాను ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. వాస్తవానికి, దమ్మాలపాటిపై నమోదైన కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ, దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆ తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. దీంతో, ఈ కేసును నెలరోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. ఈ కేసుపై హైకోర్టులో గత నెలరోజులుగా వాదనలు జరగగా…తాజాగా దమ్మాలపాటిపై కేసులు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.