తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలపై, చేపడుతున్న పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోన్న సంగతి తెలిసిందే. తమిళనాడులో రివేంజ్ పాలికిట్స్ కు స్వస్తి చెప్పిన స్టాలిన్…అభివృద్ధే తారక మంత్రంగా దూసుకుపోతున్న వైనంపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టాలిన్ ను టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. చెన్నైలో సీఎం స్టాలిన్ ను కలిసిని సినీ ‘స్టాలిన్’…పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. స్టాలిన్ తో చిరు భేటీ అయిన సందర్భంగా అక్కడ స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు.
ఇక, స్టాలిన్ పై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. సీఎంగా స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరును పవన్ అభినందించారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలని, అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదని పవన్ అన్నారు. ఈ విషయాన్ని స్టాలిన్ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. స్టాలిన్ పరిపాలన, ప్రభుత్వ పనితీరు దేశంలోని మిగతా రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం అని పవన్ అభినందించారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్…అంతర్జాతీయ స్థాయి నిపుణులను ఆర్థిక సలహాదారులుగా నియమించి సంచలనం రేపారు. స్టాలిన్ ఏర్పాటు చేసిన అర్ధిక సలహా మండలిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ , నోబెల్ విజేత ఎస్తేర్ డుఫ్లో సహా ఐదుగురు ఆర్ధికవేత్తలను సభ్యులుగా నియమించారు. పేదలు, సామాన్యుల కోసం నియమించిన ఈ మండలి మంచి ఫలితాలనిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పెట్రో మంటలు రేగుతుంటే…తమిళాడులో లీటర్ పెట్రోల్ పై మూడు రూపాయల తగ్గించడం వెనుక ఈ మండలి పాత్ర కీలకం.
ఇక, రివేంజ్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో స్టాలిన్ నవశకానికి నాంది పలికారు. ఏఐడీఎంకే దివంగత అధినేత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో కంటిన్యూ చేసి స్టాలిన్ ఏపీ సీఎం జగన్ కు ఆదర్శంగా నిలిచారు. ఏపీలో జగన్ అన్న క్యాంటీన్లను తీసివేసిన వైనాన్ని అమ్మ క్యాంటీన్ల ఉదంతంతో ఏపీ ప్రజలు పోల్చి చూస్తున్నారు. ఇక, రూ.13 కోట్ల విలువైన జయలలిత, పళనిస్వామి బొమ్మలతో ఉన్న 65 లక్షల బ్యాగులను యధావిధిగా పిల్లలకు అందించాలని స్టాలిన్ ఆదేశించడంతో విపక్ష నేతలూ షాకయ్యారు.
కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలోనూ విపక్ష సభ్యులకు అవకాశం ఇచ్చిన స్టాలిన్ సొంత పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరిచారు. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ప్రతిపక్ష ఏఐడీఎంకే కూడా ఆమోదం తెలిపిందంటే స్టాలిన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తనపై పొగడ్తలు మానకపోతే చర్యలు తప్పవంటూ అసెంబ్లీ సాక్షిగా సొంత పార్టీ నేతలకు స్టాలిన్ ఇచ్చిన వార్నింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.