అఫ్ఘాన్ లో తాలిబన్లు పాగా వేయడంతో పౌరులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి, అమెరికా సైన్యానికి సహకరించిన వారి వివరాలు తాలిబన్లు సేకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. కాబూల్ ను వశపరుచుకున్న తాలిబన్లు…ఇళ్లను జల్లెడపట్టి ప్రజల వద్ద నుంచి కార్లు లాక్కుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో, దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వేలాదిమంది ప్రజలు తరలివస్తున్నారు. విమానం ఏ దేశానికి వెళుతుందో కూడా తెలుసుకోకుండా, విమానం ఎక్కి దేశం దాటితే చాలు దేవుడా అనుకునే పరిస్థితికి అక్కడి ప్రజలు వచ్చారు. ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో ప్రయాణికులను నియంత్రించేందుకు అమెరికా సైనికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు, ప్రజలు దేశం విడిచి వెళ్లవద్దని, తాము ప్రజలందరికీ ప్రాణ భిక్ష పెట్టామని తాలిబన్లు చెబుతున్నారు. కానీ, వారు తమ మాటలను ఆచరణలో పెట్టకపోవడంతో ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను భయపెట్టేందుకు ఉగ్రమూకలు విధ్వంసానికి తెరలేపాయి. కాబూల్ విమానాశ్రాయంలో ఆత్మాహుతి బాంబుదాడితోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబుదాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 12 మంది అమెరికా సైనికులతో పాటు 72 మంది మరణించారు. మరో, 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆ దాడికి పాల్పడింది తామేనంటూ ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
కాబూల్ లో మారణహోమానికి తమదే బాధ్యతని.ఐఎస్ఐఎస్-కె ప్రకటించింది. ఈ కిరాతమకైన ఉగ్రవాద సంస్థలో ఇతర మిలిటెంట్ గ్రూపులకు చెందిన పాకిస్థానీలు, అఫ్ఘాన్లతో పాటు ఉజ్బెక్ తీవ్రవాదులు కూడా ఉన్నారు. ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాద సంస్థ తూర్పు అఫ్ఘానిస్తాన్‌లో ప్రత్యేకించి నంగాహర్,కునార్ ప్రావిన్సులలో ఉనికిని ఏర్పరచుకుంది. 2016 నుంచి కాబూల్ వెలుపల పలు విధ్వంసకర ఆత్మాహుతి దాడులను నిర్వహించి వందలమందిని పొట్టనబెట్టుకుంది. కాబూల్‌లో స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసింది. మరోవైపు, కాబూల్ ఆత్మాహుతి బాంబు దాడి వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలని పాకిస్థాన్ ను చైనా కోరింది. ఇక, తమ సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టబోతమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు.