కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లు భారత్ తో పాటు అన్ని దేశాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. మన దేశంలో ఇంకా సెకండ్ వేవ్ తీవ్రత పూర్తిగా తగ్గలేదు. రోజుకు దాదాపుగా 30 వేల కొత్త కేసులు నమోదవుతుండడం కలవర పెడుతోంది. మరోవైపు, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, అన్ని రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా థర్డ్ వేవ్ ముప్పుపై నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) షాకింగ్ వార్నింగ్ ఇచ్చింది.
సెప్టెంబరులో థర్డ్ వేవ్ ముప్పు వచ్చే అవకాశముందని, ఆ నెలలో రోజుకు 4 నుంచి 5 లక్షల కేసులు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. ఆ నెలలో కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో అడ్మిట్ కాక తప్పని పరిస్థితులు వస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే దేశంలో 2 లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచించింది. సెకండ్ వేవ్ కు మనం సన్నద్ధం కాలేదని, కానీ, థర్డ్ వేవ్ లో రాబోయే దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని సూచించింది.
2 లక్షల ఐసీయూ బెడ్లు, 1.2 లక్షల వెంటిలేటర్ ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్ బెడ్లు, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు సిద్ధం చేయాలని సూచించింది. 2020 సెప్టెంబరులోనూ కరోనా సెకండ్ వేవ్ ముప్పు గురించి నీతి ఆయోగ్ ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా థర్డ్ వేవ్ గురించి నీతి ఆయోగ్ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా, గత 56 రోజులుగా రోజుకు 50 వేలకు దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటట్లో దేశంలో కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 403 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 4 లక్షల 34 వేల 367కు చేరింది. మరోవైపు, చిన్న పిల్లలకు కరోనా ముప్పు అధికంగా ఉందన్న నేపథ్యంలో పిల్లలు, పెద్దలు వేసుకునేందుకు అనువుగా ఉన్న జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవరసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది.