ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. మద్యపాన నిషేధం పేరుతో జగన్ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా అమ్మని నాసిరకం బ్రాండ్ లను ఏపీలో అమ్ముతున్నారని, వాటివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని దుయ్యబడుతున్నారు.
ఇక, మద్యపాన నిషేధం పేరుతో మద్యం ధరలు భారీగా పెంచడం ద్వారా మందుబాబుల జేబులు గుల్ల అవుతున్నాయంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మద్యపాన నిషేధం అంటూనే జగన్ రెడ్డి మహిళల మెడలో పుస్తెలు కూడా లాగేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. విషం కంటే ప్రమాదకరమైన బ్రాండ్లు తయారు చేసి, వాటితో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నాసిరకం మద్యం బ్రాండ్లపై ఫోకస్ చేయాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత నెల 6వ తేదీన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ లేఖలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారన్న అంశంపై పరిశీలన జరుపుతామని మాండవీయ లేఖలో పేర్కొన్నారు. మామూలుగా అయితే, ఎంపీలు రాసిన లేఖలు, ఫిర్యాదులు తమకు అందాయని చెప్పి అక్నాలెడ్జ్ మెంట్ పంపుతుంటారు. కానీ, మాండవీయ మాత్రం రఘురామ లేఖను చదివి పరిశీలిస్తామని చెప్పడంతో ఏపీలో లిక్కర్ దందాపై కేంద్రం గట్టిగా ఫోకస్ చేసిందని చెబుతున్నారు. త్వరలో ఏపీలో లోకల్ లిక్కర్ బ్రాండ్లు రద్దు చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.