భారతీయ చలన చిత్ర రంగానికి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన సినీ తారలు, ఇటు రాజకీయాల్లోనూ తారా జువ్వలుగా ఎగిరి అంబరాన్ని తాకారు. తమిళనాట ఎంజీఆర్, జయలలితలు రెండు రంగాలను శాసించగా…తెలుగునాట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తిరుగులేని కథానాయకుడిగా, మహానాయకుడిగా ఎదిగారు.
అయితే, తాత ఎన్టీఆర్ తరహాలోనే ఇటు సినీ రంగం, అటు రాజకీయ రంగం చక్రం తిప్పాల్సిన చాన్స్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జస్ట్ మిస్ చేసుకున్నారు. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న లోకేష్…అన్నీ కుదిరితే జయం సినిమాలో నితిన్ ప్లేస్ లో హీరోగా తెరంగేట్రం చేయాల్సిందట. ఇక, తెరంగేట్రం కోసం నటనలో, డాన్సుల్లో లోకేష్ శిక్షణ కూడా తీసుకున్నారు. అప్పట్లో తేజ దర్శకత్వంలో నారా లోకేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోందంటూ ఓ ప్రముఖ తెలుగు సినీ పత్రికలో పోస్టర్స్ కూడా వచ్చాయి. ‘చిరంజీవిని శాసించేది ఎవరు’ అనే క్యాప్షన్ తో ఉన్న ఆ పోస్టర్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, అదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, తారకరత్నలు తెరంగేట్రం కోసం రెడీ అవుతున్నారు. ఈ సమయంలోనే కొంతమంది జ్యోతిష్కులకు లోకేష్ జాతకం చూపించారట. అయితే, హీరోగా సక్సెస్ అందుకోవడం లోకేష్ కు అంత ఈజీ కాదని చెప్పారట. సినీరంగంలో రాణించకుంటే…ఆ ప్రభావం రాజకీయాలపై పడుతుందని చంద్రబాబు భావించారట. అందుకే, లోకేష్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలన్న చాన్స్ అలా మిస్సయిందట.
అయితే, ఆనాటి జోస్యం నిజమో కాదో పక్కనబెట్టి…లోకేష్ సినీ ఎంట్రీ ఇస్తే ఎలాఉండేదో తెలీదుగానీ…ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా లోకేష్ మంచి ఫామ్ లో ఉన్నారు. మంత్రిగా పనిచేయడమే కాకుండా, టీడీపీ భవిష్యత్ రథసారధిగా రూపుదిద్దుకుంటున్నారు. ఏది ఏమైనా…డాక్టర్ కాబోయి యాక్టర్ అయినట్లు….యాక్టర్ కమ్ పొలిటిషియన్ కావాలనుకున్న లోకేష్….పొలిటిషియన్ గా సక్సెస్ అయ్యారు.