కొన్ని ఉదంతాల గురించి విన్నప్పుడు.. తెలిసినప్పుడు ఒక పట్టాన జీర్ణించుకోవటం కష్టంగా ఉంటుంది. తాజా ఉదంతం ఆ కోవకు చెందినిదే. వందల కోట్ల ఆస్తిపాస్తులు.. తండ్రేమో వజ్రాల వ్యాపారి. ఎలాంటి కష్టానికి అవకాశం లేకుండా సాగే జీవితాన్ని వద్దనుకొని.. తొమ్మిదేళ్లకే సన్యాసిగా మారాలన్న ఆ బాలిక నిర్ణయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. విన్న వారికే ఇంతలా అనిపించే ఈ ఉదంతం.. మరి తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచిస్తే ఒక పట్టాన అందులో నుంచి రాలేని పరిస్థితి. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
గుజరాత్ లోని సూరత్ పట్టణంలో వజ్రాల వ్యాపారి ఒకరు ఉన్నారు. ఆయన పేరు ధనేష్. అతగాడి సతీమణి పేరు అమీ సంఘ్వీ. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు గడిచిన ముప్ఫై ఏళ్లుగా సూరత్ లోనే ఉంటున్నారు. వజ్రాల పాలిష్.. ఎగుమతి వ్యాపార కుటుంబానికి చెందిన వీరి పెద్ద కుమార్తె తొమ్మిదేళ్ల దేవాన్షి తాజాగా సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకోవటమే కాదు.. తల్లిదండ్రుల్ని ఒప్పించింది.
అధ్యాత్మిక జీవనం మీద తనకున్న ఆసక్తిని చెప్పి.. తన జీవితానికి ఏం కావాలన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయటంతో.. ఆమె తల్లిదండ్రులు ఏమీ చెప్పలేకపోయారు. తాజాగా జైన సన్యాసి ఆచార్య విజయ కీర్తి యాశ్సూరి సమక్షంలో సన్యాస దీక్షను తీసుకున్నది. సన్యాస దీక్ష తీసుకోవటానికి కొంతకాలం క్రితమే.. పలువురు సన్యాసులతో కలిసి దాదాపు 700 కిలోమీటర్లకు పైనే పాదయాత్ర చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా సూరత్ లో చేపట్టిన ఈ సన్యాస దీక్ష కార్యక్రమానికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు.. బంధువులు.. మిత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.