మహారాష్ట్ర రాజధాని ముంబైైలో వెలుగు చూసిన ఓ ఘటన సంచలనం రేపుతోంది. ఓ మూసేసిన షాపులో మనిషి మెదడు, కళ్లు, చెవులు, ఇతర అవయవాలు లభించడం కలకలం రేపింది. నాసిక్ లోని ఓ బిల్డింగ్ బేస్మెంట్ షాపులో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. ఆ షాపులోని రెండు ప్లాస్టిక్ కంటెయినర్లలో మనిషి కళ్లు, మెదడు, చెవులు, ఇతర ముఖ్య శరీరభాగాలు లభించడంతో పోలీసులు విచారణ మొదలుబెట్టారు.
గత 15 రోజులుగా ఆ షాపు మూసి ఉందని, అయితే, గత రెండు, మూడు రోజులుగా ఆ షాపు నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చామని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు వచ్చి ఆ షాపు తెరిచి చూడగా…ఆ షాపు నిండా చెడిపోయిన సామాన్లతో పాటు ఆ రెండు ప్లాస్టిక్ బ్యాగులు కనిపించడంతో స్థానికులు అవాక్కయ్యారు. అయితే, ఆ షాపు యజమాని ఇద్దరు కుమారులూ డాక్టర్లేనని, దీంతో, వైద్య పరిశోధనల నిమిత్తం ఆ శరీర అవయవాలను అక్కడ భద్రపరిచారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, షాపు యజమాని మాత్రం వాటి గురించి తనకు తెలియదని పోలీసులకు చెబుతున్నారట.
ఒక గుర్తు తెలియని శవం లేదా అవయవాలు దొరికితే దాదాపుగా హత్య జరిగినట్టుగా భావిస్తామని పోలీస్ కమిషనర్ పౌర్ణిమ చౌగులే అన్నారు. అటువంటిది, ఆ షాపులో ఎనిమిది చెవులు, సరైన రీతిలో కట్ చేసి దొరికాయని వివరించారు. ఆ పని ప్రొఫెషనల్ డాక్టర్ చేసినట్టుగా ఉందని తెలిపారు. లేదంటే వైద్య రంగంలో నైపుణ్యం ఉన్నవారు, ప్రతి రోజూ అదే పని చేసే వారు చెవులను కట్ చేసినట్టు ఉందన్నారు. ప్రస్తుతానికి ఇది మర్డరా కాదా ఆ చెవులు ఎవరివి అన్న కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. ఆ డాక్టర్లిద్దరినీ కూడా విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది