నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు చెందిన కంపెనీలపై సీీబీఐ దాడుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయని, ఆ దాడుల వెనుక ఏపీ సీఎంఓ ఉన్నతాధికారి ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ అని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. సాక్షి పత్రిక, ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా రఘురామ సంచలన విమర్శలు చేశారు. తాను బ్యాంకులకు రూ.23 వేల కోట్లు ఎగ్గొట్టానని కథనం రాసిన ఓ పత్రికపై పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నానని, ఆ పత్రికకు సంబంధించిన వారిపై రూ.43 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులుండటంతో తనపై అలా రాశారని ఎద్దేవా చేశారు.
జగతి కేసులో ముగ్గురు నలుగురు ప్రముఖులు మరో మూడ్నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే అవకాశముందని, వారిపై మరో కేసు వేయడం ఎందుకుని పరువునష్టం దావా వేయడం లేదని చమత్కరించారు. ప్రజాప్రతినిధులపై కేసులను వేగవంతం చేయాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు ఇష్టం లేకున్నా ఎంపీ సీటిచ్చారని, ఈ ప్రభుత్వంలో రెడ్ల డామినేషన్ ఎక్కువగా ఉందని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు మానసిక రుగ్మతలకు ఎక్కువయ్యాయని…పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదని జగన్ సర్కార్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచప్రఖ్యాతి గాంచిన తిరుపతిపై ఏడుగురు రెడ్లు పెత్తనం చేస్తున్నారని అన్నారు. ఏడు కొండలు ఏడుగురు రెడ్లు అంటూ ఏడుగురి పేర్లను వెల్లడించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంకాయమ్మ రెడ్డి అని పేర్లు వెల్లడించారు.
తిరుపతిలో తొలి దర్శనం యాదవులకు ఉండాలని, కానీ, అసలు తిరుమలలో యాదవులు కంటికి కనబడడం లేదని, యాదవ జాతికి అన్యాయం జరుగుతోందని అన్నారు. యాదవులుకు దర్శనం లేదని…కనీసం టీటీడీలో సరైన పోస్టులు కూడా లేవని విమర్శించారు.
ఓట్లకోసం బీసీలు కావాలని, రకరకాల సూట్ కేసు కార్పొరేషన్లతో బీసీలను ఆకట్టుకుంటున్నారని అన్నారు. అయితే, ఆ కార్పొరేషన్లకు ఇచ్చిన డబ్బులు..మద్యం అమ్మకాల ద్వారా రాబట్టుకుంటున్నారని, రోజుకు పది కోట్లు ఖజానాకు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.