విన్నంతనే ఒక్కసారి షాక్ తగిలే లెక్క ఒకటి తాజాగా కేంద్ర మంత్రి వెల్లడించారు. లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వచ్చిన లెక్క భారతీయుల్ని కాస్తంత వేదనకు గురి చేసేదే. గడిచిన ఐదేళ్ల కాలంలో భారత పౌరసత్వాన్ని ఎంత మంది వదులుకున్నారు.. మరెంత మంది స్వీకరించారన్న ప్రశ్నకు సంబంధించిన పూర్త వివరాల్ని లోక్ సభలో వెల్లడించారు. 2017 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు దాదాపు ఆరు లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ వివరాల్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. 2017లో 1.33 లక్షల మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకుంటే.. 2018లో 1.34 లక్షల మంది.. 2019లో 1.44 లక్షల మంది 2020లో 85,248 మంది వదులు కుంటే.. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు 1.11 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. అయితే.. భారతీయులు ఇంతలా తమ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుంటున్నారన్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఏడాదికి ఏడాది భారత పౌరసత్వాన్ని వదులుకోవటంపై భారతీయులు ఆసక్తిని పెంచుకోవటం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి.. యూఎస్ తో పాటు ఇతర దేశాలు తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చే విషయంలో బోలెడన్ని పరిమితులు విధించిన కారణంగానే గణాంకాలు ఈ తీరులో ఉన్నాయి కానీ.. అదే మరింత ఎక్కువగా పౌరసత్వాలు జారీ చేసి ఉంటే మాత్రం.. ఇంకాస్త ఎక్కువమంది భారత పౌరసత్వాన్ని వదులుకునే అవకాశం ఉందన్న విశ్లేషణ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. భారత పౌరసత్వం కోసం గడిచిన ఐదేళ్లలో 10,645 మంది దరఖాస్తుచేసుకున్నట్లుగా పేర్కొన్నారు. వీరిలో 4,177 మందికి పౌరసత్వాన్ని మంజూరు చేసినట్లుగా కేంద్రమంత్రి వెల్లడించారు. 2016-20 మధ్య వచ్చిన దరఖాస్తుల్లో అమెరికా నుంచి వచ్చిన దరఖాస్తులు 227 కాగా అఫ్టానిస్తాన్ నుంచి 795, బంగ్లాదేశ్ నుంచి184, పాకిస్థాన్ నుంచి 7782 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 2016లో 1106 మందికి.. 2017లో 817 మందికి.. 2018లో 628 మందికి.. 2019లో 987 మందికి, 2020లో 639 మందికి భారత పౌరసత్వాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న ర్యాంకింగ్ ఆధారంగా చూస్తే.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు కలిగిన దేశాల జాబితాలో భారత్ 69వ స్థానంలో ఉంది. అదే సమయంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు కలిగి దేశాల్లో యూఏఈ మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 2 స్థానంలో.. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉండటం గమనార్హం.