2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని భావించే యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఒక పోల్ ఫలితం తాజాగా విడుదలైంది.
ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ న్యూస్ – సీ ఓటర్ – ఐఏఎన్ఎస్ లు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే విజయం సాధిస్తుందన్న అంచనాను వేసింది.
పంజాబ్ లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాదని.. కాకుంటే ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద పార్టీగా అవతరిస్తుందన్న అంచనాను వేసింది.
మొత్తంగా బీజేపీ బలం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుందని.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పడతాయని చెప్పింది.
దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతున్న ఉత్తరప్రదేశ్ ఫలితానికి సంబంధించి తాజా సర్వే ఏం చెప్పిందంటే..
– 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో వందకు పైగా సీట్లను బీజేపీ కోల్పోనుంది
– అయితే.. అధికారానికి మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు.
– మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 40.7 శాతం ఓటు బ్యాంకుతో 217 సీట్లను సొంతం చేసుకోనుంది.
– 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాల్ని సొంతం చేసుకుంటే.. ఈసారి అందులో దాదాపు 108 స్థానాల్ని కోల్పోనుంది
– బీజేపీ కోల్పోయే స్థానాల్ని సమాజ్ వాదీ సొంతం చేసుకోనుంది.
– అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మొత్తం అధికార బీజేపీ వర్సెస్ ఎస్పీ మధ్యనే ఉండనుంది
– ఎస్పీ 31.1 శాతం ఓట్లతో 156 స్థానాల్లో విజయం సాధించే వీలుంది. యూపీలో బలమైన పార్టీగా సమాజ్ వాదీ అవతరించే వీలుంది.
యూపీతో పాటు ఎన్నికలు జరిగే ఉత్తరాఖండ్.. గోవా.. మణిపూర్.. పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయన్న అంచనాను చూస్తే..
పంజాబ్
ఈ రాష్ట్రంలో మొత్తం 117 సీట్లు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 59 సీట్ల మేజిక్ ఫిగర్ ను చేరుకోవాల్సి ఉంటుంది.
అయితే.. ప్రస్తుతం అధికారంతో ఉన్న కాంగ్రెస్ ఈసారి అధికారాన్ని చేజార్చుకోవటం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఇప్పుడున్న బలంలో 31 అసెంబ్లీ స్థానాల్ని కోల్పోయే అవకాశం ఉందని తేల్చారు.
ఆ పార్టీ 46 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వెల్లడయ్యాయి.
ఇక.. ఈసారి అధికారం ఖాయమని భావిస్తున్న ఆమ్ ఆద్మీ గెలుపునకు దగ్గరగా వస్తుంది కానీ.. అధికారాన్ని మాత్రం సొంతం చేసుకునే అవకాశం లేదంటున్నారు.
ఆ పార్టీ 51 స్థానాల్లో విజయం సాధించి.. అందరి కంటే ఎక్కువ సీట్లను సొంతం చేసుకున్నా.. అధికారాన్ని మాత్రం చేజిక్కించుకోలేని పరిస్థితి ఉంటుందంటున్నారు. మొత్తంగా హంగ్ ఖాయమని తేల్చింది.
ఉత్తరాఖండ్
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో అధికార బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 36 సీట్లను సొంతం చేసుకోవటం ఖాయమని సర్వే తేల్చింది.
కాకుంటే గతంలో ఉన్న అధిక్యతకు మాత్రం గండి పడనుంది. ప్రస్తుతం 57 సీట్లు ఉన్న బీజేపీకి మొత్తంగా 19 సీట్లు చేజారనున్నట్లుగా అంచనా వెలువడింది.
కాంగ్రెస్ కు ఒకే ఒక్క ఊరట ఏమంటే.. 21 సీట్లను అధికంగా సాధించి.. తన బలాన్ని 32 సీట్లను పెంచుకోనుంది.
గోవా
కేవలం 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే ఈ బుల్లి రాష్ట్రంలో ఏ పార్టీకి అయితే 21 స్థానాలు వస్తాయో వారే అధికారాన్నిసొంతం చేసుకుంటారు.
తాజా అంచనాల ప్రకారం బీజేపీ ఈ రాష్ట్రంలో 21 స్థానాల్ని సొంతం చేసుకొని అధికర పక్షంగా అవతరిస్తుందని లెక్కేశారు.
ఈ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్న కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీల కల నెరవేరదని చెబుతున్నారు.
ఆప్ ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేస్తున్నారు.
మణిపూర్
మొత్తం 60 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో 31 స్థానాల్ని ఎవరు సొంతం చేసుకుంటే వారిదే అధికారం.
అయితే.. బీజేపీ 27 స్థానాల్లో.. కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలుస్తుందని..
మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం ఖాయమని చెబుతున్నారు.