ఈ మధ్య రాజకీయ నాయకులు కొత్త కొత్త కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారు. తమ పార్టీపై, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వస్తోందంటే చాలు….ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి వేరే ఏదో కొత్త టాపిక్ పైకి జనం, మీడియా దృష్టిని మరల్చేలా చేయడం ఇప్పడు నడుస్తోన్న ట్రెండ్. ఇలా చేయడం వల్ల అసలు టాపిక్ అటకెక్కి…కొసరు టాపిక్ కొన్నాళ్లు జనం నోళ్లలో నానుతుందన్నది సదరు రాజకీయ నేతల ప్లాన్.
ఇదే ట్రెండ్ ను తాజాగా ఏపీ సీఎం జగన్ ఫాలో అయ్యారని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటూ విమర్శలపాలవుతోంది. వాటిని కప్పిబుచ్చి…జనం ఫోకస్ ను డైవర్ట్ చేసేందుకే మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లును వెనక్కు తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు మొదలు నెటిజన్ల వరకు అంతా ఘంటాపథంగా చెబుతున్నారు.
అసెంబ్లీలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత దూషణలతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనిపై విపక్ష నేతలు మొదలు పక్క రాష్ట్రాల నేతల వరకు చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ వైసీపీ నేతల తీరును తప్పుబడుతున్నారు. దీనిని కప్పిబుచ్చుకునేందుకు జగన్ కొత్త డ్రామాకు తెరతీశారన్న ఆరోపణలున్నాయి.
ఇక, ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. అలా జరగకుండా నివారించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిబుచ్చుకునేందుకు కొత్తగా ఈ బిల్లుల వ్యవహారాన్ని జగన్ తెరపైకి తెచ్చారని అంటున్నారు. రేపో మాపో 3 రాజధానుల వ్యవహారంపై ఏపీ సర్కార్ కు హైకోర్టులో అక్షింతలు తప్పవు. అందుకే, కోర్టు మొట్టికాయలు నుంచి తప్పించుకోవడానికి వేరే అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ఇక, అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విశేష స్పందన వస్తోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అమరావతికి జైకొట్టారు. దీంతో, ఏపీ బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు కూడా అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ విషయం హైలైట్ కాకుండా ఉండేందుకు అసెంబ్లీలో జగన్ కొత్త ఎపిసోడ్ కు తెర తీశారు.
అన్నింటికన్నా ముఖ్యంగా తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సహా పలువురు కుటుంబ సభ్యుల పేర్లు వినిపించాయి. అంతేకాదు, కోర్టు ప్రాంగణంలో ఈ కేసులో ప్రధాన అనుమానితుడు శంకర్ రెడ్డితో అవినాశ్ మాట్లాడడం, ఆ సందర్భంగా సీబీఐ అధికారులకు, అవినాశ్ కు మధ్య వాగ్వాదం జరగడం చర్చనీయాంశమైంది. ఇలా, ఈ 5 ముఖ్యమైన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్ కుళ్లు రాజకీయాలు చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.